Pawan Kalyan: చిరంజీవి మూవీ ప్లేస్ లో పవన్ సినిమా
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:29 AM
మెగాస్టార్ చిరంజీవి కలిసొచ్చిన మే 9వ తేదీన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదల కాబోతోందని సమాచారం. మరి అన్నకు కలిసొచ్చిన తేదీ... తమ్ముడికీ కలిసొస్తుందేమో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న 'హరిహరవీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా విడుదలతేదీ మరోసారి వాయిదా పడబోతోంది. ఈ విషయాన్ని ఇంకా నిర్మాత ఎం. దయాకర్ రావు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫిల్మ్ నగర్ లో ఈ వార్త విశేషంగా చక్కర్లు కొడుతోంది. బ్రిటీషర్స్, మొగలాయి చక్రవర్తుల కాలానికి సంబంధించిన చారిత్రక కథతో ఎ.ఎం. రత్నం సమర్పణలో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తొలి భాగం దాదాపు పూర్తయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ పై ఓ కీలక ఘట్టాన్ని రాజస్థాన్ లో చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. దానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో అనివార్యంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేయబోతున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్ లేకుండానే సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ భావించారట. అయితే... అత్యంత కీలకమైన ఆ ఘట్టం లేకుండా విడుదల చేస్తే... అభిమానులు నిరాశ పడే ఆస్కారం ఉందని భావించి, దానికంటే విడుదలను వాయిదా వేయడమే బెటర్ అని అనుకున్నారట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దాదాపుగా పూర్తి చేసిన బృందం ఈ చిత్రాన్ని ఇప్పుడు ముందు అనుకున్న మార్చి 28న కాకుండా మే 9న విడుదల చేస్తుందట.
Also Read: Samantha : నందినీ రెడ్డితో సమంత మరోసారి...
ఒకరికి మోదం... ఒకరికి ఖేదం!
నిజానికి కొంతకాలంగా 'హరిహర వీరమల్లు' సినిమా మార్చి 28న రాకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ తేదీలలో నితిన్ 'రాబిన్ హుడ్' (Robinhood), సంగీత్ శోభన్ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) మూవీస్ ను ఆ చిత్రాల నిర్మాతలు విడుదల చేయడానికి సిద్ధపడ్డారని తెలిసింది. కానీ మొన్నటి వరకూ 'హరిహర వీరమల్లు' చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం మార్చి 28న తమ చిత్రం వస్తుందనే పోస్టర్స్ ద్వారా తెలిపారు. మార్చి చివరి వారంతో ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు మోహన్ లాల్, పృథ్వీరాజ్ మలయాళ చిత్రం 'ఎంపరాన్', విక్రమ్ తమిళ చిత్రం 'వీరధీర శూరన్2' కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా పడిందని తెలియడంతో వీరందరూ హ్యాపీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే... 'హరిహర వీరమల్లు' సినిమా మే 9న విడుదల కాబోతోందనే వార్తలలో నిజం ఉంటే మాత్రం... ఇప్పటికే ఆ డేట్ ను బ్లాక్ చేసుకున్న ఇద్దరు నిర్మాతలు కాస్తంత ఇబ్బంది పడాల్సిందే. సంక్రాంతి బరిలోకి 'విశ్వంభర' (Vishwambhara) తో దిగాల్సిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)... తన కొడుకు రామ్ చరణ్ (Ram Charan) 'గేమ్ ఛేంజర్'కు దారి ఇచ్చి... తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో 'విశ్వంభర' మేకర్స్ తమ చిత్రాన్ని మే9 కి వాయిదా వేశారు. ఎందుకంటే మే 9 చిరంజీవి కలిసొచ్చిన రోజు. ఆయన నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలు అదే తేదీన విడుదల అయ్యి, ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే... ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి 'విశ్వంభర' మరోసారి వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే ప్రస్తుతం రవితేజ తన 75వ చిత్రం 'మాస్ జాతర' చేస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికి రావాల్సిన మూవీ కాని రవితేజకు యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ లేట్ అయ్యింది. దీనిని కూడా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చూస్తూ చూస్తూ నాగవంశీ, త్రివిక్రమ్ తమ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మూవీ మీద వేయలేని పరిస్థితి. సో... ఈ రకంగా 'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా కొందరికి మోదాన్ని, కొందరికి ఖేదాన్ని కలిగిస్తోంది.
Also Read: Khushbu Sundar: పెళ్ళి రోజు సందర్భంగా భర్తకు గుండు!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి