Pawan Kalyan: మే 9న రాబోతున్న 'హరిహర వీరమల్లు'

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:45 AM

మెగాస్టార్ చిరంజీవికి అచ్చి వచ్చిన మే 9నే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదల కాబోతోంది. నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినట్టు మేకర్స్ తెలిపారు.

అంతా అనుకున్నట్టే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఆగమనం మరోసారి వాయిదా పడింది. మార్చి 28న విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీని మే 9కి వాయిదా వేసినట్టుగా సమర్పకులు ఎ.ఎం. రత్నం (A. M. Ratnam), నిర్మాత ఎం. దయాకరరావు తెలిపారు. ఈ సినిమా ఆలస్యంగా వచ్చినా సంచలనం సృష్టిస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ.. చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ. ఎం. జ్యోతి కృష్ణ, ఎక్కడా రాజీ పడకుండా వేగంగా 'హరి హర వీరమల్లు' సినిమాని పూర్తి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభ గల ఈ సాంకేతిక బృందం, ప్రేక్షకులకు వెండితెరపై మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఇదే విషయాన్ని ఎ. ఎం. రత్నం చెబుతూ, నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేయక తప్పలేదని అన్నారు.


పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ (Bobby Deol) నటిస్తున్నారు. ''యానిమల్, డాకు మహారాజ్'' చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ (Anupam Kher), జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'హరిహర వీరమల్లు'లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

విశేషం ఏమంటే... మే 9వ తేదీ చిరంజీవికి ఎంతో అచ్చి వచ్చిన రోజు ఆయన నటించిన రెండు సినిమాలు ''జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్'' అదే తేదీన విడుదలై అఖండ విజయాన్ని అందుకున్నాయి.

Also Read: Donga: చిరంజీవిని రెండుసార్లు దొంగ అనిపించిన ఘనుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 11:57 AM