Gunasekhar: 'శాకుంతలం'కు పూర్తి కాంట్రాస్ట్ గా 'యుఫోరియా'
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:59 PM
సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాలను తెరకెక్కించి తన సత్తాను చాటుకున్న గుణశేఖర్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కు తగ్గ మూవీగా 'యుఫోరియా'ను రూపొందిస్తున్నారు.
టాలీవుడ్ లో పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ గా గుణశేఖర్ (Gunasekhar) కు పేరుంది. తొలి చిత్రం 'లాఠీ' నుండే తనదైన పంథాలో సినిమాలు తీయడం మొదలెట్టారు గుణశేఖర్. మొదటిసినిమాతో ఉత్తమ నూతన దర్శకుడు కేటగిరిలో నంది అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత నరేశ్, ఇంద్రజ జంటగా తెరకెక్కించిన 'సొగసు చూడతరమా' డీసెంట్ హిట్ గా నిలిచింది, దానికీ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డును అందుకున్నారు గుణశేఖర్. ఆ తర్వాత అందరూ బాలనటీనటులతో ఆయన తెరకెక్కించిన 'రామాయణం' (Ramayanam) ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రను పోషించాడు. ఇక చిరంజీవి (Chiranjeevi) తో గుణశేఖర్ తెరకెక్కించిన 'చూడాలని ఉంది' (Choodalani Vundi) కమర్షియల్ గా ఘన విజయాన్ని అందుకుంది. జగపతిబాబుతో తీసిన 'మనోహరం' (Manoharam) ఫిల్మ్ మేకర్ గా గుణశేఖర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. మహేశ్ బాబు (Maheshbabu) తో తెరకెక్కించిన 'ఒక్కడు' కమర్షియల్ మూవీస్ డైరెక్ట్ గా గుణశేఖర్ కు పట్టం కట్టింది. అలానే అనుష్క (Anushka) నాయికగా ఆయన తెరకెక్కించిన చారిత్రక చిత్రం 'రుద్రమదేవి' సైతం ప్రేక్షుకుల ఆదరణను చూరగొంది. సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న గుణశేఖర్... సమంత (Samantha) నాయికగా త్రీడీలో 'శాకుంతలం' తీశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోకపోయినా... ఇప్పుడు తాన పంథాను తానే మార్చుకుని కాంటెంపరరీ ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో 'యుఫోరియా'ను తెరకెక్కిస్తున్నారు. తన గత పౌరాణిక చిత్రం 'శాకుంతలం'కు పూర్తి భిన్నంగా ఈ తాజా చిత్రం ఉండబోతోంది.
దాదాపు ఇరవై యేళ్ళ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'యుఫోరియా' సినిమాలో భూమిక చేస్తోంది. విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి బాలనటి సారా అర్జున్ (Sara Arjun) నాయికగా నటిస్తోంది. అలానే నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి తదితులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 'యుఫోరియా' మూవీ నుండి టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియో విడుదలయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాత నీలిమా గుణ తెలియచేశారు. షూటింగ్ ఇటీవలే పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిపారు. ఈ వివరాలతో పాటు చిన్నపాటి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.