Godavari Re-Release: ఇది కదా అసలైన రీ రిలీజ్
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:02 PM
Godavari Re-Release: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇందులో అప్పట్లో ఫ్లాప్ అయినా సినిమాలు కూడా రీ రిలీజ్ చేయడం సినీ అభిమానులకు విసుగు తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతమైన కల్ట్ క్లాసిక్ బొమ్మ రీ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.
శేఖర్ కమ్ముల.. తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్నాడు. సున్నితమైన కాంప్లికేటెడ్ కథలను చాలా సింపుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన మాస్టర్. ప్రస్తుతం ఆధునిక భావనలతో, సింపుల్ స్టోరీలను తెరకెక్కించడంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ వేవ్స్ సృష్టిస్తుంది. ముఖ్యంగా స్థానిక ప్రాంతాల అందాలు, సంస్కృతిని స్క్రీన్ పై చూపించడమే మలయాళ సినిమా సక్సెస్ ఫార్ములా. తెలుగు రాష్ట్రాల అందాన్ని, సంస్కృతిని ఇప్పటి వరకు చాలా దర్శకులు సరిగ్గా పట్టించుకోక పోవడం మన దౌర్భాగ్యం. వంశీ లాంటి కొందరు దర్శకులు గోదావరి జిల్లాల అందాలను తెరపై చక్కగా చూపించారు. ఆ తర్వాత అంతో ఇంతో ట్రై చేసింది శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల తన కెరీర్ ఆరంభం నుండి హైదరాబాద్ ని చాలా చక్కగా చూపించాడు. మిగతా డైరెక్టర్లు అందరు హైదరాబాద్ అనగానే బుద్దుడి బొమ్మ, చార్మినార్ వద్ద ఒక షాట్ పెట్టి వదిలేసేవారు. కేవలం హైదరాబాద్ నే కాదు, గోదావరి నది అందాన్ని కూడా శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరపై చూపెట్టాడు. ఆ సినిమానే 'గోదావరి'. సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో ప్రత్యేకం. స్వచ్ఛమైన తెలుగు సంస్కృతితో పాటు, ఆధునిక భావాలను అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఇప్పటికి అన్ని తరాల ప్రేక్షకులు ఆ సినిమాని గొప్పగా ఆరాధిస్తారు. ఈ కల్ట్ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొనే మేకర్స్ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవును మార్చి 1న యావత్ తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమా థియేటర్లలో ఈ సినిమాని మరోసారి రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాకి కేఎమ్ రాధాకృష్ణన్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్. కాగా, సినిమాని దర్శకుడు శేఖర్ కమ్ముల.. బాపు తెరకెక్కించిన అందాల రాముడు సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నారట. ఆనంద్ వంటి ఎవర్ గ్రీన్ సినిమా తర్వాత ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమాపై భారీ అంచనాలకు కారణమైంది. ఈ సినిమా ఏకంగా 5 నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డు కొల్లగొట్టింది.