Reba Vs Ketika: అందాల భామల హాట్ సాంగ్స్

ABN , Publish Date - Mar 06 , 2025 | 07:59 PM

'రొమాంటిక్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ, 'సామజవర గమన'తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెబా జాన్ ఇద్దరూ ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ గా మారిపోయారు. రెబా 'మ్యాడ్ స్వ్కేర్'లోనూ, కేతిక 'రాబిన్ హుడ్'లోనూ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు.

ఇవాళ స్టార్ హీరోయిన్ల సినిమాల్లోని వేషధారణ, పాటల్లో వాళ్ళు వేసే స్టెప్స్ చూస్తుంటే... ఐటమ్ సాంగ్స్ కు ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. అందుకే కాబోలు స్టార్ హీరోయిన్లు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామనగానే నిర్మొహమాటంగా ఐటమ్ సాంగ్స్ కు పచ్చజెండా ఊపేస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా రాణించిన కాజల్ (Kajal), తమన్నా (Tamannah), శ్రుతీహాసన్ (Shruthi Haasan), సమంత (Samantha) వంటి వాళ్ళంతా ఈ జాబితాలో ఉన్నారు. అయితే అప్ కమింగ్ హీరోయిన్లు, అవకాశాల కోసం అర్రులు చాస్తున్న వారు సైతం ఐటమ్ సాంగ్స్ కు సై అనడం మనం చూస్తేనే ఉన్నాం. విశేషం ఏమంటే... కొంతకాలంగా తెలుగువారిని అలరిస్తూ వచ్చిన ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు తొలిసారి ఐటమ్స్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఒకరు రెబా జాన్ (Reba John). తమిళ అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన రెబా జాన్... 'సామజవర గమన' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో అమ్మడికి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రెబా జాన్ మరోసారి శ్రీవిష్ణు (Sri Vishnu) సరసన 'మృత్యుంజయ్' మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఇంతలో అమ్మడికి 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) మూవీలో ఐటమ్ సాంగ్ చేసే బంపర్ ఆఫర్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇచ్చింది. ఛాన్స్ దొరికిందే చాలు అనుకున్న రెబా నిర్మొహమాటంగా అందుకు అంగీకరించింది. 'స్వాతి రెడ్డి...' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై, సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇంతవరకూ ఈ పాటకు 13 మిలియన్ వ్యూస్ లభించాయి.

Image 1.jpg


తాజాగా మరో అందాల చిన్నది కూడా తొలిసారి ఐటమ్ సాంగ్ కు సై అనేసింది. నాలుగేళ్ళ క్రితం 'రొమాంటిక్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ (Ketika Sharma). తొలి చిత్రం పరాజయం పాలైనా... అమ్మడికి ఆఫర్స్ మాత్రం బాగానే దక్కాయి. నాగశౌర్య 'లక్ష్య', వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా', సాయి దుర్గా తేజ్ 'బ్రో' (Bro) చిత్రాలలో కేతిక నటించింది. అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం మొహమాట పడని కేతిక ఇంతవరకూ ఐటమ్ సాంగ్ లో మాత్రం నటించలేదు. కానీ ఇప్పుడొచ్చిన ఓ ఆఫర్ ను అమాంతంగా సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నితిన్, శ్రీలీల జంటగా నిర్మిస్తున్న 'రాబిన్ హుడ్' (Robinhood) లో ఈ అందాల చిన్నది కుర్రకారుని టెంప్ట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలో 'అదిదా సర్ ప్రైజూ' అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో కేతిక నర్తించింది. ఈ పాటను మార్చి 10న విడుదల చేయబోతున్నారు మేకర్స్. చిత్రం ఏమంటే... రెబా జాన్ ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ చేసిన 'మ్యాడ్ స్క్వేర్', కేతిక శర్మ తొలిసారి శృంగార గీతం చేసిన 'రాబిన్ హుడ్' రెండు చిత్రాలూ ఈ నెల 28నే జనం ముందుకు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు చేసిన సాంగ్స్ లో ఎవరి దానికి ప్రేక్షకులు ఫిదా అవుతారో చూడాలి.

Also Read: Veera Dheera Sooran-2: రేర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో విక్రమ్ సినిమా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 06 , 2025 | 07:59 PM