Tollywood: ఒకే రోజున రెండు ఫాదర్ సెంటిమెంట్ మూవీస్
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:41 PM
ఈ శుక్రవారం జనం ముందుకు రాబోతున్న రెండు ప్రధానమైన చిత్రాల కోర్ పాయింట్ ఇక్కటే. అదే ఫాదర్ సెంటిమెంట్! మరి ఈ రెండు సినిమాలలో దేనికి ప్రేక్షకులు ఓటు వేస్తారో చూడాలి!
గత వారం వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 'లైలా (Laila), తల, నిదురించు జహాపనా, బ్రహ్మా ఆనందం (Brahma Anandam)' చిత్రాలు పరాజయం విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. అలానే ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమంగ్ అయిన 'ఇట్స్ కాంప్లికేటెడ్' సైతం థియేటర్లలో విడుదలైంది కానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ 'కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్' దీ అదే పరిస్థితి. ఇక 'ఘంటసాల' బయోపిక్ కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల మీద ప్రేక్షక్షులకు దృష్టి పెట్టారు.
ఈ శుక్రవారం 'బాపు' (Baapu) , 'రామం రాఘవం' (Ramam Raghavam), 'డెవిల్స్ ఛైర్' చిత్రాలతో పాటు రెండు తమిళ అనువాద చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తమిళంతో పాటు తెలుగులో వస్తుండటం విశేషం. అందులో ఒకటి ధనుష్ డైరెక్ట్ చేసిన 'జాబిలమ్మ నీకు అంతకోపమా' కాగా, రెండోది ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' (Return of the Dragon). ధనుష్ మూవీలో తెలుగువారికి సుపరిచితం అయిన అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తే... 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
ఈ వారం వస్తున్న రెండు సినిమాల కథాంశాలు చాలామందికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. అది 'బాపు', 'రామం రాఘవం'. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన 'బాపు' టైటిల్ కు తగ్గట్టే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఫాదర్, సన్ సెంటిమెంట్ చిత్రం. ఇందులో బ్రహ్మాజీ తండ్రిగా 'బలగం' సుధాకర్ రెడ్డి నటించారు. కాటికి కాళ్ళు చాపిన తండ్రి ద్వారా లబ్ది పొంది, అప్పులబారి నుండి బయటపడాలని ఓ కొడుకు చేసే ప్రయత్నం 'బాపు' చిత్రం.
కమెడియన్ ధనరాజ్ (Dhanraj) తొలిసారి దర్శకత్వం వహించిన తీసిన సినిమా 'రామం రాఘవం'. ఇందులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముతిరఖని (Samuthirakhani) తండ్రిగా నటిస్తే... అప్రయోజకుడైన ఆయన కొడుకుగా ధనరాజ్ నటించాడు. ఇది కూడా ఫాదర్, సన్ రిలేషన్ మీద సాగే చిత్రమే. ఒకే రోజున విడుదల కానున్న ఈ ఫాదర్, సన్ సెంటిమెంట్ చిత్రాలలో ప్రేక్షకులు దేనివైపు మొగ్గు చూపుతారో చూడాలి.