దర్శకుడిగా మారుతున్న ప్రముఖ దర్శకుడి తనయుడు.. ఎవరో తెలుసా?
ABN , Publish Date - Feb 07 , 2025 | 09:19 PM
టాలీవుడ్‌లో వీరోచిత చిత్రాలతో దర్శకుడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ తనయుడు ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు ఎవరు? ఆ దర్శకుడి తనయుడు ఎవరు? అనే వివరాలలోకి వెళితే..
టాలీవుడ్‌లో ఈ దర్శకుడి పేరుకి పరిచయం అక్కరలేదు. ఈ దర్శకుడి పేరు వినబడితే చాలు.. వీరత్వం కనిపిస్తుంది. ఆయన సినిమాలన్నీ కూడా పోరాటాలపైనే ఉంటాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు ఎన్ శంకర్. ఈ పేరు వినగానే ఆయన రూపొందించిన ‘శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ’ వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలు మన కళ్ల ముందు మెదులుతాయి. అప్పట్లో ఈ చిత్రాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దర్శకుడి తనయుడు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ యంగ్ దర్శకుడి పేరు ఏంటని అనుకుంటున్నారా? దినేష్ మహీంద్ర.
Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..
దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తన తండ్రి బాటలోనే దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తి చేసిన దినేష్ మహీంద్ర త్వరలోనే మెగా ఫోన్ పట్టి ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని పట్టాలెక్కించబోతున్నారు.
నూతన నటీనటులతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్ఎక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.