Tollywood: ఈ వారం డబ్బింగ్ చిత్రాలదే పై చేయి!
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:22 PM
ఫిబ్రవరి 21న ఐదు సినిమాలు తెలుగులో విడుదలైతే, అందులో డబ్బింగ్ సినిమాలదే పైచేయి అయ్యింది. ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా', ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రాలే పర్వాలేదనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 21న తెలుగులో ఐదు చిత్రాలు విడుదలైతే, అందులో మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ మూవీస్. చిత్రం ఏమిటంటే... తెలుగు స్ట్రయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ సినిమాలే ఈ వీకెండ్ లో సందడి చేస్తున్నాయి. పోనీ అవేమైనా తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలా? అంటే కాదు. నటులుగా ఇప్పుడిప్పుడే బులిబులి అడుగులు వేస్తున్న వాళ్ళు చేసి సినిమాలు. ఈ శుక్రవారం తెలుగులో 'బాపు(Baapu)', 'రామం రాఘవం (Ramam Raghavam)', 'ది డెవిల్స్ ఛైర్' సినిమాలు వచ్చాయి. 'బాపు' సినిమా కథ నచ్చి సీనియర్ నటుడు బ్రహ్మాజీ అసలు రెమ్యూనరేషనే తీసుకోకుండా చేశానని చెప్పారు. దయా దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఓ సన్నకారు రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్ని తాళలేక అందులోంచి బయటపడటం కోసం ఇంటి పెద్దాయనను తుదముట్టించడానికి సిద్ధపడే నిస్సహాయతను ఈ సినిమాలో చూపించారు. బ్రహ్మాజీ (Brahmaji) తో పాటు ఆమని (Aamani), 'బలగం' సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని చేదు నిజాలను తట్టుకోవడానికి, సినిమాను ప్రోత్సహించడానికి జనాలు ఆసక్తి చూపించడం లేదు. ఇక మరో సినిమా ధనరాజ్ హీరోగా నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన 'రామం రాఘవం'. ఈ సినిమాలో ధనరాజ్ (Dhanraj) తండ్రిగా ప్రముఖ నటుడు, దర్శకుడు సముతిరఖని (Samuthirakhani) నటించాడు. అలానే ఆయన భార్యగా ప్రమోదిని చేసింది. ఇతర కీలక పాత్రలను చక్కని గుర్తింపు ఉన్న నటీనటులే చేశారు. అయితే... ఇది కూడా 'బాపు' మాదిరి కథాంశంతో తెరకెక్కిందే. తండ్రి ఆదర్శాన్ని అర్థం చేసుకోలేని కొడుకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి, చివరకు తండ్రినే హతమార్చాలని అనుకుంటాడు. నటీనటులు ప్రతిభా పాటవాలు ఎలా ఉన్నా... ఈ కథను కూడా జనాలు పెద్దంతగా మనసుకు ఎక్కించుకోవడం లేదు. ఇక మూడో సినిమా 'ది డెవిల్స్ ఛైర్' గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.
స్ట్రయిట్ తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే... చిత్రంగా ఈ శుక్రవారం విడుదలైన రెండు తమిళ చిత్రాలు బెటర్ టాక్ ను, కలెక్షన్స్ ను తెచ్చుకున్నాయి. గతంలో 'పా పాండి' సినిమాను డైరెక్ట్ చేసిన ధనుష్ (Dhanush) గత యేడాది 'రాయన్' మూవీని తెరకెక్కించాడు. అందులో అతనే హీరో కూడా. అయితే తాజాగా తాను దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంతకోపమా' చిత్రంతో మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమాలో అనికా సురేంద్రన్ నాయికగా నటించింది. కథ గొప్పగా లేకపోయినా... ఎక్కడా బోర్ కొట్టకుండా సరదా సరదాగా సాగిపోయిందని సినిమాను చూసిన వారంతా చెబుతున్నారు. ఈ రోమ్ కామ్ కు ధనుష్ దర్శకుడిగా నూరుశాతం న్యాయం చేశాడంటూ కితాబిస్తున్నారు. అలానే ఈ వారం విడుదలైన మరో సినిమా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. ఈ మూవీలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించారు. అశ్వత్ మరిముత్తు దీనికి దర్శకుడు. ఈ సినిమా కూడా ఏమంత గొప్పగా లేదంటూనే జనాలు బాగానే ఆదరిస్తున్నారు. గతంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' కూడా తెలుగులో బాగానే ఆడింది. ఇప్పుడీ సినిమా ఫస్ట్ హాఫ్ గొప్పగా లేదు కానీ సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు. మొత్తం మీద తెలుగు సినిమాలపై ఈవారం డబ్బింగ్ చిత్రాలదే పైచేయి అయ్యింది.