Balakrishna: బాలయ్యతో బోయపాటి ఆ క్రెడిట్ కొట్టేస్తాడా?
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:04 PM
నందమూరి బాలకృష్ణతో వరుస విజయాలను అందుకున్న దర్శకులు కోడి రామకృష్ణ, బి. గోపాల్... వారి తర్వాత ఆ కోవలోకే చేరాడు బోయపాటి శ్రీను.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) యాభై ఏళ్ళ నటజీవితంలో అనేక రికార్డులు సాధించారు. ఆ రికార్డులు ఆయన కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతున్నాయి. బాలయ్యతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఆయనతో కలసి కొన్ని రికార్డులు క్రియేట్ చేయడం విశేషం! బాలకృష్ణ కెరీర్ లో ఆయనకు వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ అందించిన దర్శకులు ముగ్గురున్నారు. వారు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna), బి.గోపాల్ (B.Gopal), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) అని బాలయ్య ఫ్యాన్స్ ఇట్టే చెప్పేస్తారు. ఇలా ముగ్గురు దర్శకులతో హ్యాట్రిక్స్ చూస్తూ సాగిన స్టార్ తెలుగునాట లేరనే చెప్పాలి.
భళా అనిపించిన బాలయ్య, కోడి జోడి...
అందరికన్నా బాలయ్యకు ముందు హ్యాట్రిక్ అందించిన దర్శకునిగా కోడి రామకృష్ణ నిలిచారు. బాలయ్య కెరీర్ లోనే తొలి బిగ్ హిట్ గా నిలచిన 'మంగమ్మగారి మనవడు' (Mangamma gari Manavadu) కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమా హైదరాబాద్ లో 560 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై ఈ నాటికీ ఓ రికార్డుగా నిలచే ఉంది. ఓ తెలుగు చిత్రం హైదరాబాద్ లో రోజూ మూడు ఆటలతో గ్యాప్ లేకుండా 560 రోజులు చూడడం అన్నది ఒక్క బాలకృష్ణ 'మంగమ్మగారి మనవడు' పేరిటే ఉంది. ఆ తరువాత 'మంగమ్మగారి మనవడు' తీసిన భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే బాలయ్యతో 'ముద్దుల క్రిష్ణయ్య (Muddula Krishnayya), మువ్వగోపాలుడు (Muvva Gopaludu)' వంటి హిట్స్ ను రూపొందించారు కోడి రామకృష్ణ. ఈ మూడు సినిమాలు ఒక్కోటి 300 రోజులు ప్రదర్శితం కావడం విశేషం! ఈ రికార్డ్ ఇప్పటి దాకా తెలుగునాట ఏ హీరోకు లేకపోవడం గమనార్హం! ఆ తరువాత బాలయ్యతో కోడి రామకృష్ణ "భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, ముద్దుల మేనల్లుడు" వంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో 'ముద్దుల మావయ్య' (Muddula Mavayya) కూడా బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమా కూడా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండే రావడం విశేషం! 'ముద్దుల మావయ్య' కూడా గోల్డెన్ జూబ్లీ చూసింది. ఒక బ్యానర్ లో ఒకే హీరోతో ఓ డైరెక్టర్ మూడు గోల్డెన్ జూబ్లీస్ చూడడమన్న అరుదైన రికార్డును కోడి రామకృష్ణ సొంతం చేసుకున్నారు. అది బాలయ్యతోనే కోడికి సాధ్యమైందన్న విషయాన్ని మరువరాదు.
అలా బాలయ్య, కోడి కాంబినేషన్ సాధించిన రికార్డులు అన్ బీటబుల్ గా నిలచే ఉండడం విశేషం.
Also Read: Ratan Rishi: ఆర్టిస్ట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దన్ను
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలయ్యతో గోపాల్ అరుదైన రికార్డులు!
కోడి రామకృష్ణలాగే బాలయ్యకు వరుస విజయాలతో హ్యాట్రిక్ అందించిన మరో దర్శకుడు బి.గోపాల్. బాలకృష్ణతో గోపాల్ తెరకెక్కించిన తొలి చిత్రం 'లారీ డ్రైవర్' (Lorry Driver) సూపర్ హిట్ కాగా, రెండో సినిమా 'రౌడీ ఇన్ స్పెక్టర్' (Rowdy Inspector) బంపర్ హిట్ గా నిలచింది. ఇక బాలయ్య, గోపాల్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం 'సమరసింహారెడ్డి' (Samarasimha Reddy). ఈ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావ్ మూవీ రిలీజ్ రోజునే చేతులెత్తేసి ఇక తనకు సంబంధం లేదన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన 'సమరసింహారెడ్డి' విశేషాదరణతో 75 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. 30 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. తెలుగునాట రోజూ నాలుగు ఆటలతో 30 కేంద్రాలలో రజతోత్సవం చూసిన తొలి చిత్రంగా 'సమరసింహారెడ్డి' నిలచింది. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా 'సమరసింహారెడ్డి' విడుదలైంది. ఈ చిత్రం మూడు కేంద్రాలలో 200 రోజులు డైరెక్ట్ గా ప్రదర్శితమై, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. తరువాత 2001 జనవరి 11న పొంగల్ బరిలో దూకిన బాలయ్య, గోపాల్ చిత్రం 'నరసింహనాయుడు' (Narasimha Nayudu) కూడా అరుదైన చరిత్రను లిఖించింది. ఈ సినిమా తెలుగునాట వంద కేంద్రాలలో శతదినోత్సవం చూసిన మొట్టమొదటి చిత్రంగా నిలచింది. ఈ చిత్రం ఏలూరు మినీ అంబికాథియేటర్ లో ఏకధాటిగా 275 రోజులు 4 ఆటలతో ఆడి అప్పట్లో అబ్బో అనిపించింది. ఈ సినిమా 19 కేంద్రాలలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఓ హీరోతో ఓ డైరెక్టర్ వరుసగా రెండు సినిమాలతో 19 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చూడడమన్న రికార్డ్ ఈ నాటికీ చెక్కుచెదరకుండా ఉంది. అది బాలయ్య, గోపాల్ కాంబోకే సాధ్యమైందని అభిమానులు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఓ హీరో, ఓ డైరెక్టర్ సంక్రాంతి సందడిలో రెండు భారీ విజయాలు చూడడమన్న రికార్డు కూడా బాలయ్య గోపాల్ కాంబోకే ఉండడం విశేషం! విచారకరమైన విషయం ఏంటంటే ఇంత చరిత్ర సృష్టించిన బాలయ్యతో గోపాల్ ఐదో సినిమా 'పలనాటి బ్రహ్మనాయుడు' ఏ మాత్రం అలరించలేకపోయింది.
Also Read: Jyothi Poorvaj: కిల్లర్ హీరోయిన్ కు కర్ణాటక స్టేట్ అవార్డ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సౌత్ లోనే సంచలనం!
బాలకృష్ణకు వరుసగా మూడు ఘనవిజయాలను అందించి హ్యాట్రిక్ కొట్టిన దర్శకునిగా బోయపాటి శ్రీను కూడా నిలిచారు. బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన "సింహా (Simhaa), లెజెండ్ (Legend), అఖండ (Akhanda)" చిత్రాలు ఎంతటి సంచలన విజయాలు సాధించాయో అందరికీ తెలుసు. వీటిలో మొదటగా వచ్చిన 'సింహా' చిత్రం 2010 బంపర్ హిట్ గా నిలవడమే కాదు, 92 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చివరి చిత్రంగా నిలచింది. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం 'లెజెండ్' 2014లో విడుదలయింది. ఈ సినిమా ఎమ్మిగనూరులో ఏకధాటిగా ఒకే థియేటర్లో 420 రోజులకు పైగా రోజూ 4 ఆటలతో ప్రదర్శితమై ఓ రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు, ప్రొద్దుటూరులోనూ ఈ సినిమా డైమండ్ జూబ్లీ చూసింది. రెండు కేంద్రాలలో డైమండ్ జూబ్లీ చూసిన ఏకైక తెలుగు చిత్రంగా 'లెజెండ్' నిలచింది. ఇక ప్రొద్దుటూరులో 'లెజెండ్' ఏకంగా వేయి రోజులకు పైగా ప్రదర్శితమై సౌత్ లోనే చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన మూడో చిత్రం 'అఖండ' 2021లో జనం ముందు నిలచింది. ఈ చిత్రం కూడా డైరెక్ట్ గా రజతోత్సవం చూసింది. ప్యాండమిక్ పీరియడ్ లో థియేటర్లకు జనాలు రావడానికే భయపడుతున్న రోజుల్లో విడుదలైంది 'అఖండ'. ఈ చిత్ర ఘనవిజయంతోనే తెలుగునాట ప్రేక్షకులు పరుగులు తీస్తూ మళ్ళీ థియేటర్లకు రావడం అన్నది జరిగింది.
ఇలా కోడి రామకృష్ణ, బి.గోపాల్, బోయపాటి శ్రీను బాలకృష్ణకు హ్యాట్రిక్స్ అందించడమే కాదు అరుదైన రికార్డులూ అందుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి 'అఖండ' సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కూడా ఘనవిజయం సాధిస్తే ఆయన బి.గోపాల్ చెంతన చేరతారు. లేదంటే బాలయ్య హ్యాట్రిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా మిగిలిపోతారు. మరి 'అఖండ-2'తో బోయపాటి శ్రీను బాలయ్యకు ఏ రేంజ్ సక్సెస్ ను అందిస్తారో, ఈ సినిమాతో ఏ లాంటి రికార్డ్ సొంతం చేసుకుంటారో చూడాలి.
Also Read: Court Review: ప్రియదర్శి కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి