Dil Raju: ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:31 PM
Dil Raju: దిల్ రాజు కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్ట్నర్స్, స్నేహితుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ దాడులపై దిల్ రాజు భార్య తేజస్వి క్లారిటీ ఇచ్చింది.
మంగళవారం ఉదయం నుండి ప్రముఖ సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా ఒకే సమయంలో 55 బృందాలు 8 చోట్ల తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలని నిర్మించిన అగ్ర నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులలో ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
మంగళవారం ఉదయం స్టార్ట్ అయినా ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్ రాజు కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్ట్నర్స్, స్నేహితుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ దాడులపై దిల్ రాజు భార్య తేజస్వి క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. " ఈ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు. ఈ తనిఖీలు సినిమాలకు సంబంధించినవే. మమ్మల్ని బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాము. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు" అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు ఈ దాడులు 'పుష్ప 2' సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంపై కూడా జరిపారు. నిర్మాతలు రవిశంకర్, నవీన్ సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు.