Dil Raju: ఆ రెండు సీక్వెల్స్ పై దిల్ రాజు ఫోకస్

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:31 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు రెండు సీక్వెల్స్ పై దృష్టి పెట్టారు. అందులో ఒకటి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కాగా మరొకటి 'శతమానం భవతి నెక్ట్స్ పేజ్'.

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) దృష్టి ఇప్పుడు రెండు సీక్వెల్స్ మీద ఉంది. సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్ (Game Changer), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)' చిత్రాలను 'దిల్' రాజు విడుదల చేస్తే.... అందులో మొదటిది పరాజయం కాగా రెండో సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. సీనియర్ తెలుగు స్టార్ హీరోస్ మూవీస్ లలో ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇటీవలే ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని కూడా పూర్తి చేసుకుంది.


ఇదిలా ఉంటే... ఫిబ్రవరి 7న 'దిల్' రాజు తాను పన్నెండేళ్ళ క్రితం నిర్మించి విడుదల చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (Seethamma Vaakitlo Sirimalle Chettu) మూవీని రీ-రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయొచ్చనే భావన 'దిల్' రాజుకు ఎంతో కాలంగా ఉంది. ఆ బాధ్యతను ఆయన ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకే అప్పగించాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరహాలోనే అన్నదమ్ముల అనుబంధం తెలిపేలా కథ రాస్తే యంగ్ హీరోస్ దీనిని నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నారు. అలానే శర్వానంద్ హీరోగా 'దిల్' రాజు నిర్మించిన 'శతమానం భవతి' (Sathamanam Bhavathi) మూవీ ఏకంగా ఆయనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. సో... దానికి సీక్వెల్ తీయాలని కూడా 'దిల్' రాజు కొంతకాలంగా అనుకుంటున్నారు.


కొంతకాలం క్రితం దర్శకుడు సతీశ్ వేగేశ్నతో 'శతమానం భవతి నెక్ట్స్ పేజ్' పేరుతో సినిమా తీస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ముందు కెళ్ళలేదు. ఇప్పుడు మరోసారి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను దిల్ రాజు కథపై సీరియస్ గా కూర్చోమని కోరారట. అలానే సతీశ్ వేగేశ్న కూడా తన ఇతర ప్రాజెక్ట్ ను త్వరత్వరగా ముగించి 'శతమానం భవతి నెక్ట్స్ పేజ్' (Shatamanam Bhavathi Next Page) ఫైనల్ వర్షన్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు. అటు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటు సతీశ్ వేగేశ్న ఇద్దరు దర్శకులు ప్రస్తుతం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఇచ్చిన ఈ ఆఫర్ ను వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. సో... అన్నీ అనుకున్నట్టు జరిగితే... ఈ రెండు సీక్వెల్స్ ను ఇదే యేడాది దిల్ రాజు సెట్స్ మీదకు తీసుకెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Also Read: మొగల్తూరు మారాజులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 11 , 2025 | 03:31 PM