Dil Raju: పవన్‌ను నేనూ అలాగే అనుకున్నా..

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:00 PM

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ నా గురించి చెప్పిన మాటలు విని కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది’’ అని దిల్‌ రాజు అన్నారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ నా గురించి చెప్పిన మాటలు విని కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది’’ అని దిల్‌ రాజు అన్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అతిథిగా హాజరయ్యారు. వకీల్‌సాబ్‌ సినిమా వల్ల వచ్చిన పారితోషికం తమ పార్టీకి ఒక ఇంధనంగా పనిచేసిందని పవన్‌ ఈ వేదికగా అనడంతో దిల్‌ రాజు భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ ‘‘పవన్‌ కల్యాణ్‌ను నేను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటా. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ‘తొలిప్రేమ’ నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. దాదాపు 25 ఏళ్ల ప్రయాణం. కెరీర్‌ మంచి స్థ్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదు. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదు. ఎంతో శ్రమించారు. 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయనే నిజమైన గేమ్‌ ఛేంజర్‌. సక్సెస్‌ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే  విజయం తప్పక వరిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైంది’’.

వారధిగా ఉంటాను ...
ఈ మధ్యన ఒకటి రెండు మినహా వరుసగా పరాజయాలు చూశా. గేమ్‌ ఛేంజర్‌తో తప్పకుండా కమ్‌బ్యాక్‌ ఇస్తానని నమ్మకంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఇందులోని సన్నివేశాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు రాజకీయ సంఘటనలను ప్రతిబింబిస్తాయి. అవి తమకు చెందినవి అని ఎవరైనా ఆపాదించుకుంటే మేము ఏమీ చేయలేం. ఈ సన్నివేశాలు, పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావని సినిమా ముందు డిస్క్లైమర్‌ వేస్తున్నాం. మా బ్యానర్‌పై నిర్మితమైన మరో చిత్రం ుసంక్రాంతికి వస్తున్నాం’ కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నా. ఆ సినిమా పూర్తి క్రెడిట్‌ అనిల్‌ రావిపూడికే చెందుతుంది. ఇక తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు ఆనందంగా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా వర్క్‌ చేస్తాను. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. చిత్ర పరిశ్రమ అభివృద్థికి తోడ్పడతాను.

 

Updated Date - Jan 06 , 2025 | 03:00 PM