Daaku Maharaaj: 'డాకు మహారాజ్'పై తిరుపతి తొక్కిసలాట ప్రభావం
ABN , Publish Date - Jan 09 , 2025 | 09:33 AM
Daaku Maharaaj: తిరుపతి తొక్కిసలాట ఘటన 'డాకు మహారాజ్' పై పడింది. దీంతో చిత్ర నిర్మాతలు అభిమానులకు దిగ్భ్రాంతితో సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని అందించారు.
బుధవారం రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురంలో జరగాల్సిన 'డాకు మహారాజ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్నీ 'డాకు మహారాజ్' టీమ్ అధికారికంగా తమ 'X' ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. "తిరుపతిలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా, జరిగిన విషాద సంఘటనతో మా బృందం తీవ్రంగా ప్రభావితమైంది. . భక్తి, లక్షలాది మందికి ఆశాకిరణం, మన కుటుంబాల సంప్రదాయాల్లో ప్రతిష్టాత్మకమైన భాగమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. పరిస్థితుల దృష్ట్యా, 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనుకున్న విధంగా కొనసాగించడం సరికాదని మేము భావిస్తున్నాము. బరువెక్కిన హృదయాలతో, ప్రజల భక్తి, మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో, మేము నేటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ కష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు మేము ఆశిస్తున్నాము" అంటూ పోస్ట్ చేశారు.
తిరుపతిలో జరిగిన తొక్కిలాటలో కొందరు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరం. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన.. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేయడం జరిగింది.
- నందమూరి బాలకృష్ణ
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.