Priyadarshi: కోర్టుతో సారంగపాణి జాతకం మార్పు
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:15 PM
ప్రియదర్శి సోలో హీరోగా నటించిన 'సారంగపాణి జాతకం' ఏప్రిల్ 18న రాబోతోంది. విశేషం ఏమంటే... ఇటీవల వచ్చిన 'కోర్టు' సినిమా మంచి విజయాన్ని అందుకోవడం 'సారంగపాణి జాతకం'కు కలిసివచ్చే అంశం.
పెద్దంత గుర్తింపు లేని హీరోల చిత్రాలకు కథే బలం. అందుకే కథే తమ చిత్రానికి హీరో అని కూడా మేకర్స్ నిర్మొహమాటంగా చెబుతుంటారు. ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి (Priyadarshi) కూడా తన సినిమాల విషయంలో ఇదే మాట అంటూ ఉంటాడు. 'మల్లేశం' (Mallesam) బయోపిక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి కథాబలం ఉన్న చిత్రాలనే ఎంచుకుని చేస్తున్నాడు. అయితే... అతను పూర్తి స్థాయిలో సోలో హీరోగా చేయకపోయినా... ప్రాధాన్యమున్న పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు. ఇక సోలోగా చేసిన 'బలగం' (Balagam) చిత్రం మంచి విజయాన్ని అందుకుని ప్రియదర్శికి కూడా కమర్షియల్ సక్సెస్ దక్కుతుందని నిరూపించింది. ఆ ఊపులోనే మరికొన్ని సినిమాలు అంగీకరించి చేశాడు. అలా చేసిన వాటిలో 'సారంగపాణి జాతకం' (Sarangapaani Jathakam) కూడా ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. వేసవి కానుకగా ఏప్రిల్ 18న దీనిని రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.
ఇదిలా ఉంటే... ప్రియదర్శి కీలక పాత్ర పోషించిన 'కోర్ట్' (Court) మూవీ విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను నిర్మించింది హీరో నాని (Naani) కావడంతో ఇండస్ట్రీ అంతా అతనికి దన్నుగా నిలిచింది. పోక్సో యాక్ట్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొన్న ఓ యువకుడిని కోర్టు ఉచ్చులోంచి ఎలా ప్రియదర్శి తప్పించాడన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమా ప్రియదర్శి, శివాజీతో పాటు ఇతర నటీనటులకూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కమర్షియల్ గానూ హిట్ అయ్యింది. దాంతో... సహజంగానే ఇది ప్రియదర్శి తదుపరి చిత్రం 'సారంగపాణి జాతకం'కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఎందుకంటే... గత యేడాది వచ్చిన ప్రియదర్శి సోలో హీరోగా నటించిన 'డార్లింగ్' మూవీ బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన '35 చిన్న కథ కాదు' ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. సో... 'కోర్టు' విజయం ఒక రకంగా ప్రియదర్శి కెరీర్ కు ఊతమివ్వడమే కాకుండా... 'సారంగపాణి జాతకం'ను మార్చే ఆస్కారం కనిపిస్తోంది. ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన 'సారంగపాణి జాతకం'లో నరేశ్ విజయకృష్ణ, భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 18న వస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: VijayaShanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. విజయశాంతి వ్యాఖ్యలు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి