Tollywood: ప్రొడ్యూసర్ మృతిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Feb 26 , 2025 | 10:34 PM

'గం గం గణేశా' నిర్మాత కేదార్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారు చనిపోతున్నారని అన్నారు. కేదార్ మృతి వెనుక కూడా కుట్రకోణం దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దుబాయ్ లో కన్నుమూసిన తెలుగు సినిమా నిర్మాత కేదార్ (Kedar) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ లో ఓ వివాహ వేడుక కు హాజరైన కేదార్ సెలగంశెట్టి ఆ తర్వాత తాను విడిది చేసిన హోటల్ లో తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూశారన్నది ప్రాధమిక సమాచారం కాగా మాదక ద్రవ్యాలను అతిగా తీసుకున్నారనే వార్తలూ వచ్చాయి. అంతేకాదు... బీఆర్ఎస్ (BRS) కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కేదార్ తో పాటు అదే రూమ్ లో ఉన్నారని కొన్ని మీడియా వర్గాలు కథనాలను ప్రసారం చేశాయి. అయితే... తనపై వచ్చిన ఈ ఆరోపణలను తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఖండించారు.


కేదార్ సెలగంశెట్టికి తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులతో పరిచయాలు బాగా ఉన్నాయి. గతంలో ఓ పబ్ ను నిర్వహించిన ఆయన గత యేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ వాడిన కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఆయనే డ్రగ్స్ సప్లయ్ చేశారని తొలుత ఆరోపించిన పోలీసులు, ఆ తర్వాత కేదార్ డ్రగ్స్ బాధితుడని గుర్తించారు. గతంలో సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నట్టు కేదార్ ఓ ప్రకటన చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ లోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ (Anand Devarakonda) హీరోగా 'గం గం గణేశ' మూవీని కేదార్ నిర్మించారు. రకరకాల కారణాలతో విడుదలలో జాప్యం జరిగిన ఈ సినిమా పరాజయం పాలైంది. అయితే... తాజా పరిణామాలతో కేదార్ నుండి తీసుకున్న అడ్వాన్స్ ను విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి ఇచ్చాశాడని తెలుస్తోంది.


ఇదిలా ఉంటే... బుధవారం న్యూఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో కేదార్ మరణం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు చనిపోతున్నారని, దీనిపై మీడియా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. తమకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే... దీనిపై కూలంకషంగా విచారణ జరుపుతామని అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్... ఇలాంటి విషయాలపై ఎందుకు విచారణ కోరరని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో చనిపోతున్న వారికీ, కేటీఆర్ (KTR) కు అనుబంధం ఉందనే అనుమానం వచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 'పుష్ప-2' విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో సీఎం తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి చిత్రసీమకు చెందిన నిర్మాత మృతి సందర్భంగానూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Updated Date - Feb 26 , 2025 | 10:35 PM