Chiranjeevi: తమన్ వ్యాఖ్యలపై చిరంజీవి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:21 PM
"సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి" అన్నారు చిరంజీవి
"డాకు మహారాజ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికగా సంగీత దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు నోట మాటలు ఫ్రీగా వచ్చేస్తాయి. కొన్ని మాటలు స్ఫూర్తినిస్తాయి. కొన్ని పదాలు నాశనం చేస్తాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి? (కామెంట్స్ చేసేవారిని ఉద్దేసించి) మనం పాజిటివ్‌గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
తమన్ ఏమన్నారంటే..
"ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విజయం వచ్చిందని చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నెగిటివ్ ట్రోల్స్ అందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ "విజయం అనేది చాలా గొప్పది. అది ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. దాని నుంచే ఇంకా బాగా పని చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఫ్లయింగ్ హై షైన్‌లో ఉంది. సినిమాని కాపాడడం మన అందరి బాధ్యత. నిర్మాత మనకు దేవుడితో సమానం. తనని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు వైపు చూస్తోంది. మనమే మన సినిమాని చంపేసుకుంటే బాధగా ఉంది. అలా ఏ సినిమాకీ జరగకూడదు. తెలుగు సినిమా గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి హీరో అభిమానికీ ఉంది. సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ట్రోల్స్ అనేది భయంకలిగిస్తోంది. సిగ్గుగా కూడా అనిపిస్తోంది. ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ర్టీ పరువు పోతుంది. ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి హీరో ఫ్యాన్‌కి సినిమాను రక్షించుకోవలసిన బాఽధ్యత ఉంది. హిందీ మలయాళ కన్నడ వాళ్ళు మన తెలుగు సినిమా చేయాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. కానీ మనం మాత్రం మన సినిమాను ట్రోలింగ్స్‌తో చంపుకుంటున్నాం. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు’’ అని ఘాటుగా స్పందించారు. అయితే వేదికలపై అతి తక్కువ మాట్లాడే తమన్ తెలుగు సినిమా కోసం, జరుగుతున్న ట్రోలింగ్ కోసం ఇంతగా మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.