MegaStar Chiranjeevi: 'విజేత'కు విశిష్ట సత్కారం
ABN , Publish Date - Jan 03 , 2025 | 08:30 PM
దీప్తి నన్ను కలవడం కాదు, నేనే తనని కలవడానికి వస్తానని గొప్ప మనసుతో స్పందించారు చిరంజీవి.
పారిస్ పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెని ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఆయన దీప్తితో మాట్లాడుతూ.. ఇంకేం కావాలని అడిగారట దానికి ఆమె మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఉందని చెప్పింది. దీంతో గోపీచంద్ చిరుకి ఈ విషయం చేరవేశారు. తర్వాత ఏం జరిగిందంటే..
దీప్తిని నన్ను కలవడం కాదు, నేనే తనని కలవడానికి వస్తానని గొప్ప మనసుతో స్పందించారు చిరంజీవి. చెప్పినట్లుగానే శుక్రవారం ఆయన దీప్తిని గోపీచంద్ అకాడమీలో కలిశారు. దీప్తిని సన్మానించి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అలాగే అకాడెమీలోని ఇతర పిల్లలతో కలిసి ముచ్చటించారు. దీనికి పుల్లెల గోపీచంద్ స్పందిస్తూ.. 'చిరంజీవి గారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను' అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించి దీప్తి చరిత్ర సృష్టించారు. అలాగే తెలంగాణ తరఫునా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళగా ఆమె నిలిచారు.