Chiranjeevi Fire: లండన్ ట్రిప్.. డబ్బు వసూలు  చేయడంపై చిరు ఫైర్ 

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:10 PM

  చిరంజీవి లండన్‌ టూర్‌ను (london Tour) కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని, ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చిరంజీవి  దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi)ని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సంస్థ - యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. అయితే  చిరంజీవి లండన్‌ టూర్‌ను (london Tour) కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని, ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చిరంజీవి  దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 

"ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని టచ్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకోను. దీన్ని నేను ఖండిస్తున్నా. ఫ్యాన్స్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి విషయాల్లో  అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం" అని ట్వీట్ చేశారు.  


ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) చేస్తున్నారు. త్రిష కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ లేదా జులైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి అనిల్  రావిపూడి దర్శకత్వంలోనూ చిరు నటించనున్నారు. ఇప్పటికే కథ ఓకే కాగా, పూర్తి స్క్రిప్ట్‌ను అనిల్‌ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే శ్రీకాంత్‌ ఓదెలతో ఓ మాస్‌ యాక్షన్‌ మూవీని చిరంజీవి చేయనున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:10 PM