Chiranjeevi: రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు.. అనుమానం వదిలేయండి

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:51 PM

మళ్లీ చిరంజీవి రాజకీయం వైపు అడుగేస్తారేమో అనుమానం వ్యక్తమవుతున్న తరుణంలో చిరంజీవి స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తరచూ రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ప్రధాని మోదీతో (PM modi) వీడియో కాన్ఫరెన్స్‌లో తదితర విషయాల్లో చిరంజీవి చురుగ్గా ఉండడంతో మళ్లీ ఆయన రాజకీయం వైపు అడుగేస్తారేమో అనుమానం వ్యక్తమవుతున్న తరుణంలో చిరంజీవి స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. జీవితాంతం కళామతల్లి సేవలోనే  ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీరంగానికి సేవలు, ఇతర సేవా కార్యక్రమాల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని ఆయన చెప్పారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవితాంతం రాజకీయాలకు (no politics) దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా. ‘పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా?’ అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్‌ పెట్టుకోవద్దు. కళామతల్లి సేవలోనే ఉంటాను’’ అని అన్నారు.  



బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ తాత– మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’  . ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న బాక్సాఫీసు ముందుకు రానుంది.  ‘‘ఇటీవల జరిగిన ‘లైలా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కూ ముఖ్య అతిథిగా వెళ్లా. దాంతో, నేను తప్ప ఎవరూ లేరా? అని మీకూ అనిపించొచ్చు. ఎక్కువ చిత్రాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. దాని విడుదల తేదీ కూడా అంతే ముఖ్యం. ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత ప్రాధాన్యం. దర్శకుడు అనిల్‌ రావిపూడి  సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అద్భుతంగా   ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీమ్‌ కనిపించేది’’ అని అన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:51 PM