Vicky Kaushal: 'ఛావా' తెలుగు ట్రైలర్ విడుదల

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:43 PM

విక్కీ కౌశల్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'ఛావా' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దీనిని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. మార్చి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

2025లో బాలీవుడ్ కు కొత్త ఊపిరిని అద్దింది 'ఛావా' (Chhaava) చిత్రం. జనవరి మాసంలో చెప్పుకోదగ్గ విజయాలు లేక విలవిల లాడుతున్న సమయంలో వచ్చిన హిందీ చిత్రం 'ఛావా' ఘన విజయం సాధించింది. సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై రూ. 500 కోట్ల గ్రాస్ ను ఇది వసూలు చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chatrapthi Shivaji Maharaj) తనయుడు శంభాజీ (Sambhaji) వీరగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మూడు వందల యేళ్ళ క్రితం నాటి చరిత్రకు సంబంధించింది. దాంతో ఈ తరాన్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనే సందేహం కొంతమందికి లేకపోలేదు. బహుశా అందుకే కావచ్చు... ఈ చిత్ర నిర్మాతలు కేవలం హిందీలోనే 'ఛావా' చిత్రాన్ని విడుదల చేశారు. ఎప్పుడైతే ఈ సినిమా భాషా బేధం లేకుండా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతోందనే అప్పుడు వారిలో కొత్త ఆలోచన మొలకెత్తింది. ఇతర భాషల్లోకి కూడా 'ఛావా'ను అనువదించి విడుదల చేస్తే... మరింత మందిని తమ చిత్రం చేరువ అవుతుందనే నమ్మకం కలిగింది. దాంతో తెలుగులో డబ్ చేసి మార్చి 7న జనం ముందుకు తీసుకొస్తున్నారు.


'ఛావా' చిత్రంలో శివాజీ తనయుడు శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించాడు. అతని నటనకు అన్ని ప్రాంతల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈసారి జాతీయ అవార్డును ఖచ్చితంగా విక్కీ కౌశళ్ అందుకుంటాడంటూ కొందరు ఇప్పటి నుండి ధీమా వ్యక్తం చేస్తున్నారు. శంభాజీ భార్య పాత్రను రశ్మికా మందణ్ణ (Rashmika Mandanna) పోషించింది. అత్యంత క్రూరుడైన మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నటించారు. లక్ష్మణ్‌ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'ఛావా' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ గీతా ఆర్ట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా మార్చి 3న తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో 'ఛావా' విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ నెల 7 నుండి జిల్లా, మండల కేంద్రాలలోనూ ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: The Paradise: నేచురల్ స్టార్ నాని నయా అవతార్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2025 | 12:45 PM