Chhaava: తెలుగులోనూ వచ్చేస్తున్న శంభాజీ మహరాజ్!

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:46 PM

హిందీలో ఈ యేడాది అఖండ విజయాన్ని సాధించి రూ. 500 కోట్ల గ్రాస్ ను అందుకోబోతున్న 'ఛావా' చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగువారి ముందుకు తెస్తోంది.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాధ 'ఛావా' (Chhaava) గా రూపుదిద్దుకుని, జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అనువదించి విడుదల చేసి ఉంటే బాగుండేదని కొన్ని రోజులుగా వివిధ వర్గాలు కోరుతున్నాయి. మిగిలిన భాషల సంగతి ఎలా ఉన్నా... తెలుగువారి కోరిక మాత్రం ఇప్పుడు నెరవేరబోతోంది. మార్చి 7న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి అల్లు అరవింద్ (Allu Aravind) కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయబోతోంది. 300 కంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ వున్న గీతా ఆర్ట్స్ కు ఈ అవకాశాన్ని దినేశ్‌ విజన్ (Dinesh Vijan) కు చెందిన మాడ్డాక్ ఫిలిమ్స్ సంస్థ ఇచ్చింది.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప -2' (Pushpa -2) సినిమాతో హిందీలో 'ఛావా' విడుదల కావాల్సి ఉంది. కానీ 'పుష్ప' ఫీవర్ కు భయపడి 'ఛావా' చిత్రం విడుదలను మేకర్స్ వాయిదా వేసుకున్నారు. అది ఓ రకంగా ఇద్దరికీ కలిసొచ్చింది. ఎందుకంటే... 'పుష్ప -2'లో నటించిన రశ్మికా మందణ్ణే 'ఛావా'లోనూ నాయిక పాత్రను పోషించింది. ఇప్పుడు 'ఛావా' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పంపిణీ చేయడం కూడా అందరికీ ఆనందాన్ని ఇస్తోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సంస్థ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'లో రశ్మికా మందణ్ణ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఓ రకంగా ఆమెతో గాఢానుబంధం ఉన్న సంస్థే 'ఛావా' తెలుగు వర్షన్ ను విడుదల చేస్తోంది.


విక్కీ కౌశల్ (Vicky Kaushal) శంభాజీగా నటించిన 'ఛావా'లో, రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారా బాయిగా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన 'ఛావా' 11 రోజుల్లో భారతదేశంలో రూ. 417.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Updated Date - Feb 26 , 2025 | 04:47 PM