Unni Mukundan: 'మార్కో'కి సెన్సార్ బ్రేక్!
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:51 PM
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర పోషించిన 'మార్కో' సినిమా థియేటర్లలో బాగా ఆడింది. అలానే ఓటీటీలోనూ చక్కని ఆదరణ లభించింది. కానీ టీవీ ప్రసారం దగ్గరకు వచ్చేసరికీ మూవీకి చిక్కులు ఏర్పడ్డాయని సమాచారం.
కొందరి పప్పులు అన్ని చోట్లా ఉడకవు... సినిమాల విషయంలోనూ అంతే... కొన్ని సినిమాలు థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొందుతాయి. మరికొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా... ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడు మంచి వ్యూవర్ షిప్ సంపాదించు కుంటాయి. ఇక కొన్ని సినిమాలైతే... థియేటరల్లో, ఓటీటీలలో పెద్దంత ఆదరణ పొందకపోయినా... టీవీల్లో ప్రసారం అయినప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ విశేషంగా చూస్తుంటారు. నిజానికి ఓటీటీ లు లేని సమయంలో థియేటర్ల తర్వాత జనాలు అత్యధికంగా టీవీల్లోనే సినిమాలను చూసేవారు. అలానే వీడియోల రూపంలో సినిమాలు వచ్చినప్పుడూ వాటిని బాగానే కొనుగోలు చేసేవారు.
థియేటర్లలో సినిమాలకు సెన్సార్ షిప్ ఉంటుంది. ఓటీటీలకు అది వర్తించదు. ఇక థియేటర్లలో 'ఎ' సర్టిఫికెట్ పొందిన సినిమాలు ప్రదర్శిస్తారు. దానికి పిల్లలను అనుమతించారు. యు/ఎ సర్టిఫికెట్ ఉండే సినిమాలను పెద్దలతో కలిసి పిల్లలు చూడొచ్చు. ఇక 'యు' సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాను ఎవరైనా నిరభ్యంతరంగా వీక్షించొచ్చు. అయితే... టీవీల దగ్గరకు వచ్చే సరికీ అక్కడ 'ఎ' సర్టిఫికెట్ మూవీస్ ను అనుమతి లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే దగ్గర సినిమాలను టీవీలో చూసినప్పుడు అందులో అతి హింస, జుగుప్స, శృంగార పరమైన సన్నివేశాలు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే 'ఎ' సర్టిఫికెట్ పొందిన సినిమాలను రీ-సెన్సార్ చేయించుకుని, యు/ఎ సర్టిఫికెట్ పొందినప్పుడే టీవీల్లో ప్రసారానికి ఆస్కారం ఉంటుంది.
ఈ నిబంధనల కారణంగా ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటించిన 'మార్కో' (Marco) మూవీ పప్పులు టీవీలో ఉడకడం లేదు. ఎందుకంటే... బాలీవుడ్ లో వచ్చిన 'కిల్' సినిమా ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన అత్యంత భయంకరమైన వయొలెన్స్ ఉన్న మూవీగా చెప్పుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మలయాళ చిత్రం 'మార్కో' దానిని మించి పోయిన వయొలెన్స్ తో తెరకెక్కిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ మేకర్స్ సైతం అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సెన్సార్ బృందం 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. థియేటర్లలో కేవలం పెద్దలు మాత్రమే దీనిని వీక్షించారు. ఇక ఓటీటీకి సెన్సార్ నిబంధనలు వర్తించవు కాబట్టి... అక్కడ కూడా నిరాటంకంగా దాని స్ట్రీమింగ్ జరిగిపోయింది. ఎటొచ్చి... దీనిని టీవీలో ప్రదర్శించాలనే సరికీ 'ఎ' నుండి 'యు/ఎ'కు సర్టిఫికెట్ ను మార్చుకోవాలి. కానీ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ తీవ్రమైన హింసను చూపిన తర్వాత రూల్స్ ప్రకారం సెన్సార్ వారు అభ్యంతరాలు తెలియచేస్తూ పోతే... సినిమా సగం కూడా ఉండకపోవచ్చు. సో... అందువల్ల 'మార్కో'ను టీవీలో చూడాలనుకునే వారి కోరిక తీరే ఆస్కారం లేదు. అయితే... పనిలో పనిగా ఇప్పుడు ఓటీటీల మీద కూడా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం 'మార్కో' సినిమాను ఓటీటీ నుండి కూడా తొలగించొచ్చనే పుకార్లూ షికార్లు చేస్తున్నాయి.
Also Read: Nayanthara: కమల్, అజిత్ ను ఫాలో అవుతున్న నయన్!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి