Daaku Maharaj : థియేటర్ దగ్గర పొట్టేలు బలి.. ఐదుగురిపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 18 , 2025 | 10:55 AM
నందమూరి అభిమానులపై కేసు నమోదు అయింది. బాలకృష్ణ (Bala Krishna) నటించిన 'డాకు మహారాజ్' (Daaku Maharaj) సినిమా థియేటర్ వద్ద బహిరంగంగా జంతుబలికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
అభిమాన హీరోల సినిమా విడుదల అంటే అభిమానులు థియేటర్ దగ్గర నానా హంగామా (Fans Hungama) చేస్తారు. భారీ కటౌట్స్, పూల అలంకారాలు, పాలాభిషేకాలు ఇలా ఒకటి తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారు. అభిమానం ఇంకా పీక్స్లో ఉంటే మేక, పొట్టేలు వంటి జంతు బలులు ఇస్తారు. అలా చేసిన నందమూరి అభిమానులపై కేసు నమోదు అయింది. బాలకృష్ణ (Bala Krishna) నటించిన 'డాకు మహారాజ్' (Daaku Maharaj) సినిమా థియేటర్ వద్ద బహిరంగంగా జంతుబలికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్సై బాలకృష్ణ (Tirupati) వివరాల మేరకు.. ఈనెల 12వ తేదీ రాత్రిన కొందరు అభిమానులు పొట్టేలును థియేటర్ వద్దకు తీసుకొచ్చి బలిచ్చి.. దాని రక్తం సినిమా పోస్టర్‌పై చల్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా కావడం, స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ కేసు నమోదుకు ఆదేశించారు. వీడియోను పరిశీలించి ఆర్‌సీపురం మండలం మచ్చారెడ్డిపల్లికి చెందిన శంకరయ్య, తిరుపతి కొర్లగుంటకు చెందిన రమేష్, చింతామణికి చెందిన సురేష్‌రెడ్డి, బంగారు పాళెంకు చెందిన ప్రసాద్, పల్లెపట్టుకు చెందిన లోకేష్ బాబుగా గుర్తించారు. వారిపై జంతు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.