Brahma Anandam: ‘బ్రహ్మా ఆనందమైన’ ముచ్చట్లు
ABN , Publish Date - Jan 16 , 2025 | 09:10 PM
Brahma Anandam: టెన్షన్ అనేది ఎప్పుడూ లేదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంటా. అయినా మన పేరుతో సినిమా వస్తుందంటే కాలర్ ఎగరేసే మూవ్‌మెంటే కదా టెన్షన్ ఎందుకు.
హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం' తాతగా ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్‌గా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. యంగ్ డైరెక్టర్ ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై టీమ్ సభ్యులు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
మీ పేరు మీద తెరకెక్కిన సినిమాలో నటిస్తున్నందుకు ఏమైనా టెన్షన్ ఉందా అని ప్రశ్నించగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. "టెన్షన్ అనేది ఎప్పుడూ లేదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంటా. అయినా మన పేరుతో సినిమా వస్తుందంటే కాలర్ ఎగరేసే మూవ్‌మెంటే కదా టెన్షన్ ఎందుకు" అన్నారు. మరి ఫిబ్రవరి 14న వస్తుందంటే సినిమాలో ఏమైనా లవ్‌స్టోరీ ఉందా అని అడగగా.. అలాంటిదేం లేదు. ఈ సినిమా తాత మనవడికి సంబంధించిన కథ అని సమాధానమిచ్చారు.
ప్రచారాలకు అందుకే దూరం
మీరు ఈ మధ్య సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటున్నారెందుకు అని మీడియా వెన్నెల కిషోర్ ని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. 'దూరంగా ఉండడం లేదు. నాకు స్టేజ్‌పై మాట్లాడాలంటే భయం. అందుకే ఎక్కడా మాట్లాడను అన్నారు. ఇంతలో బ్రహ్మానందం కలుగజేసుకొని..స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు హావభావాలు కంట్రోల్ చేసుకోవడం కష్టం. అందుకే అలా దూరంగా ఉంటున్నాడేమో అంటూ సెటైర్ వేశాడు
లెజెండ్స్ తో పనిచేయటం ఎలా ఉంది?
ఇద్దరు స్టార్ కామెడియన్స్ తో పని చేయటం ఎలా ఉందని.. గౌతమ్ ని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి చెప్పినప్పుడే నాకు భయం వేసింది. మొదటి రోజు మొదటి షాటే.. నాన్నతో కోపంగా మాట్లాడే సీన్. భయంతో వణికిపోయా. నాన్న పక్కకు పిలిచి ప్రత్యేకంగా డైలాగ్ చెప్పమన్నారు. ఆ తర్వాత భయం పోయింది. వెన్నెల కిశోర్ నాకు స్నేహితుడు అని చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకు భయపడుతూనే ఉండాలి. నేను చిరంజీవితో ఎన్నో సినిమాలు చేశాను. రేపు కొత్త సినిమాలో ఆయనతో నటించాలంటే మొదటిరోజు మనకు తెలియకుండానే భయపడతాం. దాన్ని భయం అనకూడదు. సెల్ఫ్ సపోర్ట్ అనుకోవాలి.
సినిమాలు తగ్గించారు?
బ్రహ్మానందం: ‘బాగానే చేస్తున్నాడు కానీ.. ఇంతకు ముందు ఆయన చేస్తే వచ్చినంత నవ్వు ఇప్పుడు రావట్లేదు’ అని గతంలో కొంతమంది కమెడియన్స్ అనడం మనం విన్నాం. అలాగే మరొకటి వయసు. మన వయసును దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకు ముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నా అనే విషయం కూడా నాకు తెలుసు. మనల్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడం తగ్గించేశాను. అంతేకానీ.. నాకు అవకాశాలు రాకకాదు.. చేయలేక కాదు. మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. శేఖర్ కమ్ముల సినిమాలో మొదట గౌతమ్‌ను హీరోగా పెట్టాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల గౌతమ్ అంగీకరించలేదు. నేను ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేటి తరానికి నిర్ణయం తీసుకునే అర్హత ఉంది. ఆలోచనా శక్తి ఉంది. నేను అలా ఆలోచిస్తూ ఉంటాను. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న కామెంట్స్ మెడలో బోర్డులు వేసుకుని తిరగడానికి మాత్రమే పనికివస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. స్వీయ విమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందుకే సినిమాలు తగ్గించేశాను.
ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి?
ఇప్పటి వరకు నేను తాతలాగా చేయలేదు. ఈ సినిమా నా కుమారుడు గౌతమ్‌తో చేస్తున్నా.. అందులోనూ తనకు తాతగా అంటే ప్రత్యేకమే కదా. తాత, మనవడికి మధ్య అనుబంధంలో ఒకరకమైన సరదా ఉంటుంది.
తెలుగులో కామెడీ సినిమాలు తగ్గిపోయాయి.. కారణం ఏంటి?
దీనికి కారణం చెప్పలేం. కమెడియన్ లేకుండా సినిమా తీయగలరు కానీ.. కామెడీ లేకుండా తీయలేరు. అంటే కామెడీ చేయడానికి కమెడియనే అవసరం లేదు. అందరూ చేస్తున్నారు. గతంలో దర్శకులు కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి దర్శకులు, రైటర్లు లేరని చెప్పలేం. నేను ఈ మధ్య కాస్త ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా. కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నా.
బ్రహ్మానందంతో నటించడం ఎలా ఉంది?
వెన్నెల కిశోర్: సార్‌తో చేయడం చాలా కష్టం. ఆయన ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. చూస్తే చాలు నవ్వు వస్తుంది.