Chhaava: ఈ చరిత్ర... ఏ యే సినిమాలతో...
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:31 PM
'ఛావా' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో గతంలో వచ్చిన చారిత్రక చిత్రాలను ఓసారి సింహావలోకనం చేసుకుందాం!
తాజాగా జనం ముందు నిలచిన హిందీ చారిత్రక చిత్రం 'ఛావా' (Chhaava) విజయదుందుభి మోగిస్తోంది... ఆ సినిమాను రీజనల్ లాంగ్వేజెస్ లోనూ చూడాలని జనం తపిస్తున్నారు... అంతలా అలరిస్తున్న 'ఛావా' మరికొన్ని హిస్టారికల్ మూవీస్ తెరకెక్కడానికి ఇన్ స్పిరేషన్ గా నిలచిందని ట్రేడ్ టాక్!
'ఛావా' గ్రాండ్ సక్సెస్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) కెరీర్ ను ఓ భారీ మలుపు తిప్పిందనీ చెబుతున్నారు... గత కొన్నాళ్ళుగా సౌత్ మూవీస్ ముందు బాలీవుడ్ వెలవెల బోతోంది... ఆ మధ్య షారుఖ్ ఖాన్ 'జవాన్, పఠాన్' చిత్రాల ఘనవిజయం హిందీ చిత్రసీమకు కాసింత ఊపిరి పోసింది... మళ్ళీ దక్షిణాది సినిమాల ముందు బాలీవుడ్ చిన్నబోయింది... ఈ నేపథ్యంలో ఘనవిజయం కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోన్న హిందీ చిత్రసీమకు పున్నమి వెన్నెలలా 'ఛావా' విజయం సాక్షాత్కరమయింది... ఈ యేడాది అత్యధిక వసూళ్ళు చూసిన హిందీ చిత్రంగా 'ఛావా' నిలచింది... అందేకాదు, రీజనల్ మూవీస్ ను కూడా అధిగమిస్తూ ఈ సంవత్సరం ఆల్ ఇండియాలోనే టాప్ గ్రాసర్ గా నిలచింది 'ఛావా'.
విక్కీ కౌశల్ అంతకు ముందే 'యూరి' (Uri) హిందీ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలిచారు విక్కీ కౌశల్... ఆ తరువాత నుంచి ఆచి తూచి అడుగులేస్తూ సాగారు... ఆ పై 'సర్దార్ ఉధమ్' అనే బయోగ్రాఫికల్ ఫిలిమ్ లోనూ నటించి నటునిగా తానేమిటో నిరూపించుకున్నారు... మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినా 'యూరి, సర్దార్ ఉధమ్' చిత్రాల తరువాత 'శ్యామ్ బహదూర్'లో మరోమారు దేశభక్తునిగా దర్శనమిచ్చారు విక్కీ కౌశల్... ఆ చిత్రం కూడా బయోగ్రాఫికల్ మూవీ కావడంతో విక్కీకి నటునిగా మరింత పేరు లభించింది...
అయితే ఏ నాడూ విక్కీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేదు... అది తాజాగా జనం ముందు నిలచిన 'ఛావా'తో సాధ్యమయిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు... 140 కోట్ల వ్యయంతో తెరకెక్కిన 'ఛావా' సినిమా కేవలం థియేటర్ల ద్వారానే వారంలోగా 350 కోట్లు పోగేసింది... ఈ చిత్రం తప్పకుండా 500 కోట్లు కొల్లగొడుతుందని అంచనా! విక్కీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'ఛావా' నిలవనుంది.
'ఛావా' గ్రాండ్ సక్సెస్ చూసిన జనం ఈ మధ్యకాలంలో తమను పలకరించిన పలు హిస్టారికల్ మూవీస్ ను గుర్తు చేసుకుంటున్నారు... వాటిలో కొన్ని అదరహో అనిపించాయి - మరికొన్ని బెదిరిపోయేలా చేశాయి... మొత్తానికి జనం దృష్టిని ఆకర్షించాయి...
ఆమిర్ ఖాన్ (Aamir khan) తన దేశభక్తిని చాటుకుంటూ 2001లో 'లగాన్' అనే కల్పిత కథను తెరకెక్కించి ఘనవిజయం సాధించారు... తరువాత మరో నాలుగేళ్ళకు 'లగాన్' అందించిన ఘనవిజయం స్ఫూర్తితో ఆమిర్ ఖాన్ 'మంగల్ పాండే- ద రైజింగ్' (Mangal Pandey: The Rising) అనే చిత్రంలో నటించారు.
ఆమిర్ ఖాన్ 'లగాన్' (Lagaan) స్ఫూర్తితో అప్పట్లో మరికొన్ని దేశభక్తి చిత్రాలు తెరకెక్కాయి... వాటిలో అజయ్ దేవగణ్ నటించిన 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్' 2002లో వెలుగు చూసింది... దాదాపు 18 ఏళ్ళ తరువాత మరో పీరియడ్ మూవీ 'తానాజీ- ది అన్ సంగ్ వారియర్'లో నటించి అలరించారు అజయ్ దేవగణ్... 'తానాజీ' (Tanhaji) మంచి విజయాన్ని మూటకట్టుకుంది...
దేశభక్తి చిత్రాలతో పాటు కొన్ని చారిత్రాత్మకాలు వెలుగు చూశాయి... వాటిలో అక్బర్ జీవితంలోని ప్రేమకోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన 'జోధా అక్బర్' (Jodhaa Akbar) ఆకట్టుకుంది. మరాఠా ప్రాంతంలో ఎందరో వీరులు, నాయకులు ఉన్నారు... వారిలో కొందరు ప్రేమమూర్తులుగానూ వెలిగారు... అలాంటి వారిలో పీష్వా బాజీరావ్ ను గుర్తు చేసుకోవలసిందే... మస్తానీతో బాజీరావ్ ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ట్రాజెడీ 'బాజీరావ్ మస్తానీ' (Bajirao Mastani) 2015లో వెలుగు చూసింది... రణవీర్ సింగ్, దీపికా పదుకొణే నటించిన ఈ విషాదాంత ప్రేమగాథను జనం భలేగా ఆదరించారు.
'బాజీరావ్ మస్తానీ' ఘనవిజయం స్ఫూర్తితో దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'పద్మావత్' కూడా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కింది... అక్షయ్ కుమార్ సైతం పీరియడ్ డ్రామాస్ తో సాగారు... ఆయన హీరోగా రూపొందిన 'కేసరి' (Kesari) ఆ తరువాత తెరకెక్కిన 'సమ్రాట్ పృథ్వీరాజ్' కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తోనే రూపొందాయి...
అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్ నటించిన ఎపిక్ వార్ మూవీ 'పానిపట్' 2019లో వచ్చింది - అదే యేడాది కంగనా రనౌత్ నాయికగా క్రిష్ రూపొందించిన 'మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పరవాలేదు అనిపించుకుంది... రెండు దశాబ్దాల కాలంలో బాలీవుడ్ లో పలు చారిత్రక చిత్రాలు వెలుగు చూశాయి... కానీ, వాటిలో కొన్నే మురిపించాయి... ఇప్పుడు 'ఛావా' గ్రాండ్ సక్సెస్ తో మరికొందరు పీరియడ్ డ్రామాస్ వైపు, హిస్టారికల్ మూవీస్ చెంతకు చేరుతున్నారు. బాలీవుడ్ నుండి మరెన్ని చారిత్రకచిత్రాలు వస్తాయో చూద్దాం!