Bangladesh Bengali: బంగ్లా సినిమాకు ప్రాణం పోసిన తెలుగు చిత్రాలు!

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:41 PM

భారతీయ చిత్రాల రీమేక్స్ చిత్రాలకు బంగ్లాదేశ్ లో ఆదరణ బాగా ఉంటుంది. అంతేకాదు... పలు తెలుగు సూపర్ హిట్ మూవీస్ బంగ్లాలో రీమేక్ అయ్యి విజయవంతమయ్యాయి.

ఇప్పటి దాకా అనేక తెలుగు (Telugu) చిత్రాలను తమ బంగ్లా (Bangladesh Bengali) భాషలో రీమేక్ చేసి మురిపించింది బంగ్లాదేశ్ చిత్రసీమ. అలా రూపొందిన వాటిలో నితిన్ 'ఇష్క్' ఆధారంగా తెరకెక్కిన 'ఆషిక్- ట్రూ లవ్', 'ఆటాడిస్తా' స్ఫూర్తితో 'అమర్ ప్రనేర్ ప్రియా', 'ఆర్య-2' రీమేక్ గా 'అమి షుదు చెయేచి తొమాయ్', 'డాన్ శీను' ఆధారంగా 'బాద్షా - ద డాన్' వంటి చిత్రాలు రూపొంది అక్కడి సినీఫ్యాన్స్ ను అలరించాయి. రామ్ చరణ్ 'బ్రూస్ లీ - ద ఫైటర్' రీమేక్ గా 'బెపోరొవా', సిద్ధార్థ్ 'బావ' స్ఫూర్తితో 'భలోబసర్ రొంగ్', యన్టీఆర్ 'బృందావనం' ఆధారంగా 'బుక్ ఫతే తో ముఖ్ ఫోతేన', నాగార్జున 'డాన్' రీమేక్ గా 'డాన్ నంబర్ వన్' వంటి చిత్రాలు వెలుగు చూశాయి. ఇవే కాకుండా తెలుగులో యావరేజ్, అబౌ ఏవరేజ్, హిట్స్ గా ఉన్న సినిమాలను కూడా బంగ్లా భాషలో రీమేక్స్ చేసి అక్కడి జనాన్ని అలరించారు. అలాంటి వాటిలో "మస్కా, మనసంతా నువ్వే, 100 పర్సెంట్ లవ్, కృష్ణ, ఒంటరి, చండీ, విక్రమార్కుడు" వంటి చిత్రాల రీమేక్స్ ఉన్నాయి.


bangla 1 .jpg

బంగ్లా సూపర్ స్టార్ షాకిబ్ ఖాన్!

ప్రస్తుతం బంగ్లాదేశ్ సినిమా రంగంలో నంబర్ వన్ గా సాగుతోన్న షాకిబ్ ఖాన్ (Shakib Khan)తెలుగు చిత్రాల రీమేక్స్ తోనే సూపర్ స్టార్ డమ్ చూశారని చెప్పవచ్చు. షాకిబ్ ఖాన్ తెలుగులో ఘనవిజయం సాధించిన 'పోకిరి' ఆధారంగా 'మోనర్ జాల' తీసి అక్కడ సూపర్ హిట్ పట్టేశారు. తెలుగు చిత్రాలు "ఆటాడిస్తా, చిన్నోడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి రాముడు, బాలు, డాన్, దమ్ము," వంటి చిత్రాలను రీమేక్ చేసి అక్కడ తన స్టార్ డమ్ కు గట్టి పునాది వేసుకున్నారు షాకిబ్ ఖాన్. ప్రభాస్ 'రెబల్', రామ్ చరణ్ 'నాయక్' రెండు కథలు కలిపి 'హీరో-ద సూపర్ స్టార్' రూపొందించారు. ఈ సినిమాతో నిర్మాతగానూ మారారు షాకిబ్ ఖాన్. ఆయన స్ఫూర్తితో రియాజ్, ఓమ్, బప్పీ చౌదరి, జియావుల్ రోషన్, మన్నా వంటి స్టార్స్ కూడా తెలుగు చిత్రాల రీమేక్స్ తో విజయాలను సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్ చిత్రసీమలో నేరుగా విడుదలైన తెలుగు సినిమాలు కనిపించవు కానీ, హిందీలో అనువాదమైన తెలుగు చిత్రాలు కూడా అక్కడ సందడి చేశాయి.

టాప్ గ్రాసర్ 'తూఫాన్'

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నంబర్ వన్ మూవీగా నిలచిన 'తూఫాన్' (Toofan) గత యేడాది జూన్ లో విడుదలయింది. షాకిబ్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఏడు కోట్ల బంగ్లాదేశ్ టాకాలతో తెరకెక్కి ఏకంగా యాభై ఆరు కోట్ల టాకాలు వసూలు చేసింది. మన కరెన్సీ రూపాయలతో పోల్చుకుంటే 'తూఫాన్' సినిమా 40 కోట్ల 32 లక్షల రూపాయలు పోగేసిందన్న మాట! ఈ సినిమాలోనూ పలుతెలుగు చిత్రాలు కనిపించడం విశేషం! ఏది ఏమైనా ఇన్ని భారతీయ భాషలు ఉండగా, తెలుగు సినిమాలపై ఆధారపడి తెలివిగా సాగుతోంది బంగ్లాదేశ్ సినిమా!

Updated Date - Feb 21 , 2025 | 04:41 PM