HBD Sharwanand: బ్యాక్ టు బ్యాక్ శర్వా మూడు చిత్రాలు!
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:42 PM
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నలభై యేళ్ళు పూర్తి చేసుకున్నాడు. విశేషం ఏమంటే... గత కొంతకాలంగా అతనికి సాలీడ్ అనేది దక్కకపోయినా... ఇప్పటికీ చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే... అతను చేస్తున్న మూడు చిత్రాలు ఈ యేడాది విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) మార్చి 6. పుట్టారు. దాదాపు 38 సంవత్సరాల పాటు బాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న శర్వానంద్ రెండేళ్ళ క్రితం రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికో పాప కూడా. వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోతున్నా... శర్వా కెరీర్ మాత్రం ఊహించని ఒడిదుడుకులతో సాగుతోంది. గత కొన్నేళ్ళుగా శర్వాకు హిట్ అనేది లేకుండా పోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలలో మూవీస్ చేస్తున్నా... అతను నమ్మకున్న దర్శకులు మాత్రం సాలీడ్ హిట్ ను శర్వాకు అందించలేకపోతున్నారు. గత యేడాది శర్వానంద్ నటించిన ఒకే ఒక్క సినిమా 'మనమే' (Manamey) విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో విఫలమైన ఈ చిత్రం ఇప్పటి వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. ఇటీవలే మార్చి 7 నుండి ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోందనే వార్త వచ్చింది. ఓ రకంగా థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన శర్వానంద్ అభిమానులకు ఇది అతను ఇస్తున్న బర్త్ డే కానుక అనుకోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. మూడు సినిమాలూ సెట్స్ మీదనే ఉన్నాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... ఈ మూడు కూడా ఈ యేడాది జనం ముందుకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శర్వానంద్ 36వ చిత్రాన్ని అతని హోమ్ ప్రొడక్షన్ లాంటి యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అభిలాష్ కంకర (Abhilash Kankara) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్. ఇది 1990లకు చెందిన కథ. జిబ్రాన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇంతవరకూ ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ప్రకటించలేదు. దీనితో పాటు శర్వానంద్ చేస్తున్న 37వ చిత్రం టైటిల్ ను సంక్రాంతి రోజున ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీనికి ఒకప్పటి బాలకృష్ణ చిత్రం 'నారీ నారీ నడుమ మురారీ' (Naari Naari Naduma Murari) అనే పేరు ఖరారు చేశారు. 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అజయ్ సుంకర, కిశోర్ గరికపాటి నిర్మిస్తున్నారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. ఇందులో సంయుక్త (Samyuktha), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్లు.
ఇక శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. దీనికీ ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే... శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ మూడు చిత్రాల నిర్మాణ సంస్థలతో పాటు పలువురు నిర్మాతలు, తోటి నటీనటులు కూడా శర్వానంద్ కు బర్త్ డే విషెస్ తెలియచేశారు. మరి ఈ సినిమాలతో అయినా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Also Read: Test -Ott: నయనతార టెస్ట్.. ఓటీటీలో ఎప్పుడంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి