Anurag Kashyap: ఇది పతనమే.. శంకర్‌పై అనురాగ్ అసహనం

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:00 PM

Anurag Kashyap: బాలీవుడ్ బోల్డ్, డైనమిక్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ హాట్ కామెంట్స్ చేశారు. 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్‌పై అసహనం వ్యక్తం చేశాడు. రీల్స్, అభిమానులు, బాలీవుడ్, సౌత్ డైరెక్టర్స్ అంశాలపై ఆయన మాట్లాడుతూ..

Anurag Kashyap criticizes Shankar's statement

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, రాంగోపాల్ వర్మ ప్రియ శిష్యుడు అనురాగ్ సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవల అమెరికా డల్లాస్‌లో జ‌రిగిన 'గేమ్ చేంజ‌ర్' ఈవెంట్‌లో ‌దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్‌పై ఆయన నిరాశ చెందాడు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. సినిమా స్టాండర్డ్స్ పడిపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


కొన్ని రోజుల క్రితం అమెరికా డల్లాస్‌లో జ‌రిగిన 'గేమ్ చేంజ‌ర్' మూవీ ఈవెంట్‌లో ‌డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. అడియన్స్ రీల్స్ ట్రెండుకు అల‌వాటు ప‌డ్డార‌ని, కాబ‌ట్టి త‌క్కువ నిడివిలో విష‌యం తెలుసుకోవాల‌నుకుంటున్నార‌ని, తాను 'గేమ్ చేంజ‌ర్' సినిమాను అలాంటి వారిని దృష్టి లో పెట్టుకుని తీశాన‌న్నారు. ఈ వ్యాఖ్యలను డైరెక్టర్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుల తీరు ఇప్పుడు మారిపోయింద‌ని, అందుకే మంచి సినిమాలు రావ‌ట్లేద‌ని క‌శ్య‌ప్ అన్నాడు. అలాగే.. "దర్శకుడు శంక‌ర్ వ్యాఖ్య‌ల్లోని అర్థం నాకు తెలియ‌దు. సినిమా విడుద‌లైతే ఆయ‌న అలా ఎందుకు మాట్లాడారో పూర్తిగా అర్థం కావ‌చ్చు. చాలామంది ఫిలిం మేక‌ర్స్ ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. కొన్ని రీల్స్‌ను క‌లిపి సినిమా చేశామ‌ని, ప్రేక్ష‌కులు ఇప్పుడు అదే కోరుకుంటున్నార‌ని చెబుతున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో వినూత్న‌మైన సినిమాలను ద‌ర్శ‌కులు తెరకెక్కించేవారు. ఇప్పుడు అలా ఉండటం లేదు. ప్రేక్ష‌కులకు ఏం కావాలని ఆలోచించారంటే అక్క‌డే సినిమా ప‌త‌నం మొదలవుతుంది" అంటూ అసహనం వ్యక్తపరిచాడు.


మరోవైపు ఆయన బాలీవుడ్ పై కూడా మండిపడ్డారు.. కోర్‌ ఆడియన్స్‌ను పట్టించుకోవడం బాలీవుడ్‌ ఎప్పుడో మానేసిందని కామెంట్‌ చేశారు. ఆ కారణంగానే దక్షిణాది చిత్రాలు, ఫిల్మ్‌ మేకర్స్‌కు ఈ మార్కెట్‌లో ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని అనురాగ్‌ అన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 03:06 PM