Anurag Kashyap: ఎట్టకేలకు అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ ఎంట్రీ
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:02 PM
ప్రముఖ హిందీ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇప్పటికే హిందీతో తమిళ, మలయాళ చిత్రాలలో నటించాడు. తాజాగా అడివి శేష్ 'డకాయిట్'తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) లో మంచి నటుడు కూడా ఉన్నాడు. చాలా చిత్రాలలో అతిథి పాత్రలు చేసిన అనురాగ్ అడపాదడపా కీలక పాత్రలను సైతం హిందీ చిత్రాలలో చేశాడు. అంతేకాదు... ఆరేడేళ్ళ క్రితమే తమిళ చిత్రసీమలోకి 'ఇమైక్కా నోడిగల్'తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'లియో' (Leo) లో అతిథి పాత్రలో మెరిసిన అనురాగ్ కశ్యప్ 'మహారాజ, విడుదలై -2' చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. విశేషం ఏమంటే గత యేడాది మలయాళంలోనూ 'రైఫిల్ క్లబ్' అనే మూవీతో మల్లూవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అనురాగ్. అయితే... ఈయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం చాలాకాలం పట్టిందనే చెప్పాలి. తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'డకాయిట్' (Dacoit) మూవీలో ఓ పాత్రను అనురాగ్ కశ్యప్ పోషిస్తున్నాడు.
అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్'. ఇందులో తొలుత శ్రుతీహాసన్ (Shruthi Haasan) ను హీరోయిన్ గా ఎంపిక చేసినా... ఇప్పుడు ఆ స్థానంలోకి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వచ్చింది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మిస్తోంది. సునీల్ నారంగ్ దీనికి సహ నిర్మాత. ఈ మూవీని హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తున్నాడు. హీరో అడివి శేష్ తో కలిసి డియో కథ, కథనాలను సమకూర్చాడు. ఈ చిత్రంలో ఇన్ స్పెక్టర్ స్వామిగా అనురాగ్ కశ్యప్ నటిస్తున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ అధికారి గెటప్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా తర్వాత అనురాగ్ కశ్యప్ ను వెతుక్కుంటూ అన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.
Also Read: NTR: యన్టీఆర్ ఆశీస్సులు పొందిన రికార్డ్ బ్రేక్ గురుశిష్యులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి