Anupama Parameswaran:అనుపమకు 'డ్రాగన్' బర్త్ డే గిఫ్ట్ అయ్యేనా

ABN , Publish Date - Feb 18 , 2025 | 02:03 PM

మలయాళ చిత్రం 'ప్రేమమ్' (Premam) తో 2015లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ దశాబ్ద కాలంలో దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

మలయాళ చిత్రం 'ప్రేమమ్' (Premam) తో 2015లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ దశాబ్ద కాలంలో దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సినిమాల్లో తొలిసారి నటించినా... ఆ తర్వాత సంవత్సరమే 'అ...ఆ' (A Aa) తో తెలుగు రంగంలోకి అడుగపెట్టింది. అంతేకాదు... మలయాళంలో 'ప్రేమమ్'లో చేసిన పాత్రనే తెలుగు రీమేక్ లోనూ చేసింది. 'అగరొత్తుల కురులే వలగ విసిరేసి' కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. అదే యేడాది 'కోడి' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.


Anupama.jpg

దిల్ రాజ్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న 'శతమానం భవతి' (Sathamanam Bhavathi) చిత్రం అనుపమా పరమేశ్వరన్ కు మంచి విజయాన్నే కాదు చక్కని పేరూ తెచ్చిపెట్టింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డుతో పాటు రాష్ట్ర స్థాయిలో ఐదు నందీ అవార్డులనూ గెలుచుకుంది. ఆ తర్వాత అనుపమా తెలుగులో చేసిన చిత్రాలేవీ పెద్దంత కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ తమిళ రీమేక్ వచ్చిన 'రాక్షసుడు' ఫర్వాలేదనిపించింది. ఇక మూడేళ్ళ క్రితం వచ్చిన 'రౌడీ బాయ్స్' నుండి అనుపమా కాస్తంత గ్లామర్ ట్రీట్ ఇవ్వడం మొదలెట్టింది. అప్పటి వరకూ పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమా కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. 'కార్తికేయ -2' (Karthikeya -2) లో పద్ధతి గల పాత్ర చేసినా... 'టిల్లు స్క్వేర్' (Tillu Square) లో లిప్ లాక్స్ తో సందడి చేసేసింది. గ్లామర్ పాత్రలకు అనుపమా న్యాయం చేస్తుందని ఆ సినిమా నిరూపించింది.


Madhu.jpg

పద్ధతిగల పాత్రల మీదుగా అందాల ఆరబోతకు జండా ఊపేసిన అనుపమా పరమేశ్వరన్ 'బట్లర్ ఫ్లై' (Butterfly) వంటి లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీలోనూ నటించింది. అలానే థాట్ ప్రొవోకింగ్ షార్ట్ ఫిల్మ్స్ సైతం చేసింది. ఇప్పుడు కూడా తెలుగులో 'పరదా' సినిమాలో అర్థవంతమైన పాత్రను పోషించింది. ఇవే కాకుండా 'బైసన్', లాక్ డౌన్, పెట్ డిటెక్టివ్, మరీచిక' వంటి సినిమాలలో అనుపమా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రాబోతున్న 'డ్రాగన్'లో అనుపమా పరమేశ్వరన్... ప్రదీప్ రంగనాధన్ సరసన నటించింది. ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైనరే! 'లవ్ టుడే' (Love today) తో ఇప్పటికే యూత్ ను అట్రాక్స్ చేసిన ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'డ్రాగన్' (Dragon) కూడా హిట్ అయితే... అది అనుపమకు అభిమానులు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అనుకోవచ్చు.

Updated Date - Feb 18 , 2025 | 02:27 PM