Mazaka: పీపుల్స్ స్టార్... సందీప్... ఇదేం పని ....

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:06 PM

విప్లవ చిత్రాల కథానాయకుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తిని అందరూ ప్రేమతో 'పీపుల్స్ స్టార్' అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయనకు పోటీగా మరో పీపుల్స్ స్టార్ రాబోతున్నాడు.

పీపుల్స్ స్టార్ (People's Star) ... ఈ పదం వినగానే ఎవరికైనా విప్లవ చిత్రాల రూపకర్త, నటుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) గుర్తొస్తారు. స్నేహ చిత్ర పతాకంపై మూడు దశాబ్దాలకు పైగా 30కి మించి చిత్రాలను ఆయన రూపొందించారు. ప్రజల సమస్యలను తెరపై ఆవిష్కరించి, విప్లవ పంథాలో వాటికి పరిష్కారం చూపించే నారాయణ మూర్తిని 'పీపుల్స్ స్టార్' అని పిలవడం ఎంతోకాలంగా జరుగుతోంది. కానీ చిత్రంగా ఇప్పుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) పేరు ముందు 'పీపుల్స్ స్టార్' అనే పదాన్ని తగిలించారు. ప్రస్తుతం సందీప్ కిషన్ 'మజాకా' (Mazaka) మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఇది అతనికి నటుడిగా 30వ సినిమా. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాస్తంత కాంట్రవర్శీని క్రియేట్ చేసిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన... సందీప్ కిషన్ ను పీపుల్స్ స్టార్ గా పేర్కొని మరో వివాదానికి తెర తీయాలని భావించినట్టుగా ఉంది. ఆ మధ్య నటి అన్షు (Anshu) గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఆ తర్వాత బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.


ఇప్పుడు... మరో అడుగు ముందుకేసి సందీప్ కిషన్ కు పీపుల్స్ స్టార్ అనే బిరుదును ఇచ్చేశాడు. నిజానికి ఆర్. నారాయణమూర్తి హవా తెలుగు సినిమా రంగంలో తగ్గి ఉండొచ్చేమో కానీ ఆయనైతే ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇవాళ్టి పరిస్థితుల దృష్ట్యా ఆయన సినిమాలు గతంలో మాదిరి ప్రేక్షకాదరణ పొందడం లేదన్నది నిజం. కానీ ఆర్. నారాయణమూర్తిలోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. ఏ మాత్రం వనరులు సమకూరినా... సమాజాన్ని చైతన్యపర్చడం కోసం తన వంతుగా సినిమాలు రూపొందించడానికి ఆయన ఎప్పటికీ సిద్థమే. అలాంటి ఆర్. నారాయణమూర్తికి ఉన్న 'పీపుల్స్ స్టార్' అనే బిరుదును.. ఆయన ఫీల్డ్ లో ఉండగానే సందీప్ కిషన్ కు పెట్టేయడం, దాని పట్ల సందీప్ కిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా సినిమా పబ్లిసిటీ టాక్టిస్ లో భాగంగా త్రినాథరావు నక్కిన ఆడుతున్న డ్రామానేమో ఇది అనేవారూ లేకపోలేదు. ఒకటి రెండు రోజులు ఈ బిరుదుపై వివాదం చెలరేగిన తర్వాత ఆర్. నారాయణమూర్తి సమక్షంలోనే ఆయన క్షమాపణలు చెబుతారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే... ఓ హీరోకు ఓ బిరుదును ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలని, అసలు ఏ రకంగా సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల మెప్పు పొందని సందీప్ కు ఆ బిరుదు ఏ మాత్రం తగదని హితవు పలుకుతున్నారు. మరి దీనిని సందీప్ కిషన్ ఆలకిస్తాడో లేదో చూడాలి.

Updated Date - Feb 22 , 2025 | 06:06 PM