Movie Theatres: మరో భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఇక థియేటర్లలో సినిమా కష్టమే!
ABN , Publish Date - Jan 28 , 2025 | 02:27 PM
ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు బంద్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సినిమా థియేటర్లకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు హైకోర్టు మరో భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇకపై థియేటర్లలో సినిమా మనుగడ కష్టమే. ఓటీటీల రూపంలో దెబ్బపడుతున్న థియేటర్లకు.. హైకోర్టు తీర్పు దెబ్బ మీద దెబ్బగా మారింది. వివరాల్లోకి వెళితే..
‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు వంటి వెసులుబాటు ఉండదని ఖరాఖండీగా ప్రకటించింది. సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించినా.. కోర్టు కలగజేసుకోవడంతో.. వెంటనే టికెట్ల ధరలను తగ్గించారు. దీంతో చిన్న సినిమాలకు ఏమోగానీ.. భారీ బడ్జెట్‌తో రూపొందే సినిమాలకు మాత్రం అంతే భారీగా ఇబ్బంది నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా హైకోర్టు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు, థియేటర్ సినిమాలకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే..
ఇకపై థియేటర్స్‌లో పిల్లలు సినిమా చూడాలంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే చూడాలనేలా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తరువాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు హైకోర్టు తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ టిక్కెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించి, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదన ఇదే..
అలాగే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత సినిమాలకు అనుమతించరాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేని పక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లలో చివరి షో అర్ధరాత్రి 1.30 గంటల వరకు నడుస్తుందని, ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించారు.
Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కష్టమే..
సంధ్య థియేటర్ ఘటనలో చిన్నపిల్లలతో కలిసి సదరు కుటుంబం సినిమాకు రావటంపై కూడా నెటిజెన్లు మిక్స్‌డ్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సెకండ్ షోలకు 16 సంవత్సరాల లోపు వారి నిషేధాన్ని అమలు చేయటం వల్ల అది కచ్చితంగా వసూళ్లపై ప్రభావం చూపుతుంది. కానీ ఆరోగ్యం, రక్షణ కంటే ఎది ఎక్కువ కాదు కాబట్టి.. కోర్టు ఆదేశాలపై ప్రజలలో సైతం పాజిటివ్ రెస్పాన్సే వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ ఆదేశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి అయితే కష్టమే. అసలే ఓటీటీలు వచ్చి.. ప్రేక్షకులను థియేటర్లకు రానివ్వకుండా చేస్తుంటే.. ఇప్పుడీ ఆదేశాలు మరింతగా థియేటర్లపై ప్రభావం చూపే అవకాశం అయితే లేకపోలేదు. మరోవైపు, కోర్టు ఆదేశాలపై కొందరు నెగిటివ్‌గానూ స్పందిస్తున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. తెల్లవార్లు ఫోన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కోర్టు చెబుతున్న టైమింగ్స్‌లో సినిమా చూడకపోయినా.. ఫోన్ చూస్తూనే ఉంటారు. అది కూడా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంకా కళ్లపై కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ కోణంలో కోర్టు ఎందుకు ఆలోచన చేయలేదనేలా కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.