Anil Ravipudi: 'బుల్లిరాజు'పై విమర్శలు.. చెక్ పెట్టిన అనిల్ రావిపూడి
ABN , Publish Date - Jan 21 , 2025 | 08:41 AM
Anil Ravipudi: "సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో చెప్పే యాడ్‌లో కూడా సిగరెట్ తాగినట్లు చూపిస్తారు. అంత మాత్రాన అది సిగరెట్ ప్రమోషన్ కాదు. అలాగే మేము కూడా.. "
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో విడుదలైన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడిగా నటించిన మాస్టర్ రేవంత్(బుల్లి రాజు) పాత్ర థియేటర్ లలో వీపరీతమైన నవ్వులు పూయించింది. అయితే చిన్న పిల్లోడు పెద్దలంటే గౌరవం లేకుండా అన్ని బూతులు మాట్లాడం ఏంటని పలు విమర్శలు ఎదురవుతున్నాయి.
థియేటర్‌లలో గోదారి స్లాంగ్‌లో బుల్లిరాజు మాటలు తూటాల్లా పేలాయి. ఇప్పటికే సినిమాలో తన భాష కేవలం కల్పితమే, మీరు ఎవరు ఇలాంటి పదజాలాం వాడకూడదు, నన్ను క్షమించండి అంటూ మాస్టర్ రేవంత్(బుల్లిరాజు) సభాముఖంగా వేడుకున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో విక్టరి వెంకటేష్ సమక్షంలో దర్శకుడు అనిల్ రావిపూడి 'బుల్లిరాజు'పై వస్తున్న విమర్శలపై స్పందించారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘బుల్లిరాజు పాత్రకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆ కామెడీని అందరూ సరదాగా తీసుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ పాత్ర విషయంలో విమర్శలు నా దృష్టికి వచ్చాయి. మా ఫ్రెండ్స్ కూడా కొందరు పిల్లాడితో అలా బూతులు చెప్పించడం ఏంటి అని అడిగారు. కానీ మేం ఆ పాత్రతో చిన్న సందేశం ఇచ్చాం. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఓటీటీలో కంటెంట్ చూస్తే.. వాటికి ఎక్కువ అలవాటు పడితే ఎంత ప్రమాదం అన్నది చూపించాం. ఇంగ్లిష్, హిందీ వెబ్ సిరీస్‌లకు తెలుగు అనువాదాలు చూశారంటే దారుణమైన బూతులు ఉంటాయి. వాటిని విని తట్టుకోలేం. అలాంటివి పిల్లలు చూడకూడదని చెప్పడమే మా ఉద్దేశం. సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో చెప్పే యాడ్‌లో కూడా సిగరెట్ తాగినట్లు చూపిస్తారు. అంత మాత్రాన అది సిగరెట్ ప్రమోషన్ కాదు. అలాగే మేము కూడా ఈ పాత్రలో చెడును చూపిస్తూ చిన్న సందేశం ఇచ్చాం’’ అని ఆయన చెప్పుకొచ్చాడు.