Nagabandham: ఆసక్తి రేపుతున్న అనసూయ పోస్ట్
ABN , Publish Date - Mar 01 , 2025 | 11:24 AM
నటి అనసూయ గ్లామర్ పాత్రలే కాదు... పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికీ సిద్థంగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఆమెకు భిన్నమైన పాత్రలూ లభిస్తున్నాయి.
'పెద కాపు' ఫేమ్ విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'నాగబంధం' (Nagabandham). కిశోర్ అన్నపురెడ్డితో కలిసి దర్శకుడు అభిషేక్ నామా (Abhishek Nama) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను కూడా ఆయనే సమకూర్చారు. నభానటేశ్(Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది. సెట్స్ నుండి ఆమె రాయల్ లుక్ లో కనిపిస్తున్న చేతులను ప్రజెంట్ చేసే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన తర్వాత అనసూయ రెగ్యులర్ కు భిన్నమైన పాత్రను ఇందులో చేస్తోందనిపిస్తోంది.
అవకాశం లభించాలే కానీ అనసూయ గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి వెనకాడటం లేదు. యాక్షన్ క్యారెక్టర్స్ చేయడానికీ ఆమె సిద్థంగానే ఉంది. దానికి తగ్గట్టుగానే అనసూయకు పలు చిత్రాలలో భిన్నమైన పాత్రలు లభిస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన 'రజాకర్' (Razaakar) మూవీలోనూ అనసూయ తన నటనతో ఆకట్టుకుంది. ఇక 'నాగబంధం' సినిమా విషయానికి వస్తే ఇందులో జగపతి బాబు, రిషభ్ సహానీ, జయప్రకాష్, జాన్ విజయ్, మురళీ శర్మ, శరణ్య, ఈశ్వరిరావు, జాన్ కొక్కిన్, అంకిత్ కొయ్య, సోనియా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ది సీక్రెట్ ట్రెజర్' అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల కొన్ని సుప్రసిద్థ దేవాలయాలకు సంబంధించిన గుప్త నిధుల విశేషాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాను ఐదు భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: NTR- Dasari: 45 ఏళ్ళ 'సర్కస్ రాముడు'
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి