Sivangi: వంగే రకం కాదు మింగే రకాన్ని అంటున్న ఆనంది
ABN , Publish Date - Feb 23 , 2025 | 07:26 PM
ఆనంది నటించిన తాజా చిత్రం 'శివంగి'. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో బ్యూటీ అండ్ బీస్ట్ గా ఆనంది కనిపించబోతోంది!
నటి ఆనంది (Aanandhi) కి తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ విభన్నమైన పాత్రలు దక్కాయి. దాంతో కొంతకాలంగా కోలీవుడ్ లోనే ఆనంది పలు చిత్రాలు చేస్తోంది. అయితే తెలుగులోనూ ఇప్పుడిప్పుడే ఆమెను వెతుక్కుంటూ కొన్ని పాత్రలు వెళుతున్నాయి. ఆ మధ్య 'జాంబిరెడ్డి' (Zombie Reddy) లో హీరోయిన్ గా నటించిన ఆనంది... ఆ తర్వాత 'శ్రీదేవి షోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాలలో నటించింది. తాజా ఇప్పుడు 'భైరవం' (Bhairavam) చిత్రంలోనూ నటిస్తోంది. అలానే ఆమె 'శివంగి' (Sivangi) అనే చిత్రంలోనూ యాక్ట్ చేస్తోంది.
ఆనందితో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar), జాన్ విజయ్, డా. కోయ కిశోర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. 'శివంగి' మూవీని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో నరేశ్ బాబు పి నిర్మించారు. ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీ ఫస్ట్ కాపీ ఇటీవలే విడుదలై చక్కని స్పందన తెచ్చుకుంది. తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఓ గృహిణి జీవితంలో ఒక్క రోజులో జరిగిన ఊహించని సంఘటనల నేపథ్యంలో 'శివంగి' రూపుదిద్దుకుందని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఒక క్రైమ్ సీన్ ను ప్రజెంట్ చేస్తూ ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎ.హెచ్. కాషిఫ్, ఎబినేజర్ పాల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భరణి కె ధరన్ సినిమాటోగ్రాఫర్. మార్చి 7వ తేదీ ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.