Breaking: పుష్పకు బెయిల్..
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:24 PM
Breaking: అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఇరువైపుల వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ‘పుష్ప2’ (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ కి పూర్తి ఊరటను ఇస్తూ.. రెగ్యులర్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అల్లు అర్జున్ న్యాయవాది వాదనలను విన్న న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌పై BNS యాక్ట్ 105 వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారణం కాదని వాదించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి, అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్లు దూరం ఉందని కోర్టుకు వివరించారు న్యాయవాది.
అయితే, అల్లు అర్జున్ రావడం వలనే తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అల్లు అర్జున్ రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదున్నారు పీపీ. అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. అతనికి బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పీపీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ధర్మాసనం.. అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. రూ. 50 వేలు, రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. కాగా, ప్రస్తుత అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
నిర్మాతలకు ఊరట
ఈ కేసులో A 11గా అల్లు అర్జున్ ని చేర్చగా A 12గా 'మైత్రీ మూవీ మేకర్స్' ప్రొడ్యూసర్స్ యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లను చేర్చిన విషయం తెలిసిందే. కాగా కేసులో ఊరట కోరుతూ వీరు హైకోర్టును ఆశ్రయించగా గురువారం ఉపశమనాన్ని కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. దర్యాప్తు కొనసాగిస్తున్నే, వారిని అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. గత నెల 4వ తేదిన థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టి.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులుని జారీచేశారు. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నట్లు.. నిర్మాతల కార్యాలయ సిబ్బంది.. థియేటర్ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. ఘటన జరిగిన రోజు సీనియర్ అధికారులైన ఏసీపీ, డీసీపీలలు థియేటర్‌కు వచ్చి భద్రతను పరిశీలించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదు దారు కి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టయిన బన్నీ మేనేజర్ అడ్ల శరత్‌చంద్రనాయుడు, వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్, శ్రీరాములు రాజు బెయిలు మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.