Allu Arjun: భారీ బందోబస్తు మధ్య శ్రీతేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:19 AM

Allu Arjun: కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వద్దామనుకున్నా తాము భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంగోపాల్ పేట్ పోలీసులు తెలిపారు. కానీ గంట లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ఆయన చూసుకోవాలని సూచించారు.

allu arjun visited sritej

అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) మంగళవారం ఉదయం బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను (Sreetej family) పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆస్పత్రికి బయలుదేరి వెళ్ళారు. గత 35 రోజులుగా కిమ్స్‌ ఆస్పత్రిలోనే శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో కిమ్స్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) కూడా కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. కాగా అల్లు అర్జున్‌‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట్ పోలీసులు (Ramgopalpet Police) మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.


కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వద్దామనుకున్నా తాము భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంగోపాల్ పేట్ పోలీసులు తెలిపారు. కానీ గంట లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ఆయన చూసుకోవాలని సూచించారు. సందర్శనంత గోప్యంగా ఉంచాలని, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటన దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి రావొద్దంటూ తెలిపారు. ఒకవేళ అలా వెళ్తే జరిగే పరిణామాలకు అల్లు అర్జునే బాధ్యత వహించాలని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, గతేడాది డిసెంబర్ 4న గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారనే సమాచారం రాంగోపాల్‌పేట్ పోలీసులకు చేరింది. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు మెుదటిసారిగా బన్నీకి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని తెలిపారు. బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తాము చెప్పే సూచనలు పాటించాలని, ఆ సమయంలో అనుకోని ఘటనలు జరిగితే దానికి బన్నీనే బాధ్యత వహించాలని చెప్పారు. అయితే నిన్న నోటీసులు అందించిన పోలీసులు తాజాగా ఇవాళ కూడా మరోసారి అందజేశారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షోను గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదారాబాద్ సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు సమాచారం వెళ్లడంతో థియేటర్ వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అతనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మృతిచెందగా.. శ్రీతేజ్‌కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసి రిమాండ్‪కు తరలించగా.. హైకోర్టుకు వెళ్లిన బన్ని బెయిల్‌పై విడుదల అయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి వస్తున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 10:19 AM