Allu Arjun: పుష్ప-2 థ్యాంక్స్ మీట్.. బన్నీ స్పీచ్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 09:26 AM
ఐదేళ్ల షూటింగ్ అసలు ఈ సినిమా అవుతుందా? అనిపించింది. కొవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమాను షూట్ చేశాం. వందల, వేల మంది దర్శకుడు సుకుమార్ ఏది చెబితే ఫాలో అయ్యాం. - Allu Arjun
"దర్శకుడు సుకుమార్ (Sukumar) కలల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా. థియేటర్‌లో ఒక్క మనిషే మాట్లాడతాడు. అతడే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ సుకుమార్‌ని చూసి గర్వపడుతోంది. ఆయన పర్సన్ కాదు.. ఒక ఎమోషన్’’ అని ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. దాదాపు రూ.1800 కోట్లు వసూళ్లు రాబట్టింది. శనివారం ఈ చిత్రం థ్యాంక్స్ (Pushpa-2 Thanks meet) మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ అంతా పాల్గొన్నారు. బన్నీ, సుకుమార్, నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ (DSP) టీమ్ అందరికీ సక్సెస్ షీల్డ్‌లను అందించారు.
సుకుమార్ మాట్లాడుతూ "ఇప్పటికీ ‘పుష్ప’ పూర్తి కథ చెప్పలేదు. ఇది సెకండ్ ఇంటర్వెల్. ‘పుష్ప3, 4’ ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేను’’ అని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ (Allu Arjun)
"ఐదేళ్ల షూటింగ్ అసలు ఈ సినిమా అవుతుందా? అనిపించింది. కొవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమాను షూట్ చేశాం. వందల, వేల మంది దర్శకుడు సుకుమార్ ఏది చెబితే ఫాలో అయ్యాం. అందుకే షూటింగ్ చివరి రోజు దేవుడికి ఒక్కటే నమస్కారం పెట్టుకున్నా. ఇంత మంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలని, ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని కోరుకున్నా. ఈ సినిమాతో మా అందరి జీవితాలను అర్థవంతం చేసినందుకు సుకుమార్‌కు ధన్యవాదాలు. మైత్రీ మూవీ మేకర్స్ లేకుండా ఇంత భారీ సినిమా తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడింది. సాంగ్స్‌కు మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఎలా వస్తాయా అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్ నేర్పుతారు. కానీ, గణేశ్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు. దర్శకుడు విజన్‌ను తెరపై తీసుకురావడంలో ఆయన ప్రతితి కనపడుతుంది. ఏదైనా ఫైట్ సీన్‌లో ఒకట్రెండు రోప్ షాట్స్ ఉంటాయి. కానీ, నవకాంత్ చేసిన కే్ౖలమాక్స్ ఫైట్‌ను 18-20 రోజులు తీస్తే, దాదాపు అన్నీ రోప్ షాట్స్ పెట్టారు. ఎన్ని రోజులు తీసినా, నాకు చిన్న గీత కూడా పడలేదు. అది అయన టాలెంట్. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు"
దర్శకుడే మూలం...
‘‘ఒక సినిమాకు సంబంధించి అందరూ బాగా చేయొచ్చు. కానీ, హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సరిగా చేయకపోతే, ఆ సినిమా సక్సెస్ కాదు. అలాగే నటీనటులు సరిగా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే, ఆ సినిమా కచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేశాం. అంతా సుకుమార్‌కే థ్యాంక్స్ చెప్పాలి. ‘పుష్ప’లో నటనకు గానూ చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్, డ్యాన్స్ ఇలా ఏది బాగున్నా, దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే వచ్చింది. నేను బాగా నటించానంటే, అందుకు కారణం సుకుమారే. సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు. అతడు ఎంత గొప్ప స్టార్ అయినా కూడా. నన్ను గైడ్ చేసినందుకు థ్యాంక్స్ సుకుమార్. ఈ విజయాన్ని నా అభిమానలుకు అంకితం చేస్తున్నా. నా ఆర్మీని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. ‘పుష్ప3’.. అదేంటో నాకు, సుకుమార్‌కు తెలియదు. కానీ, అదొక అద్భుతమైన ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి’’ అని బన్నీ అన్నారు.