Icon Star: దిల్ రాజుతో బన్నీ మూవీ... అదేనా...

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:47 PM

దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే అల్లు అర్జున్ నాలుగు సినిమాలు చేశారు. ఐదేళ్ళ క్రితం అతనితో దిల్ రాజు 'ఐకాన్' మూవీని ప్రకటించారు కానీ అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు తాజాగా దిల్ రాజుతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)తో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'గంగోత్రి' తర్వాత అల్లు అర్జున్ తో 'ఆర్య' (Arya) మూవీని నిర్మించి మంచి విజయాన్ని కట్టబెట్టాడు దిల్ రాజు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 'పరుగు, ఎవడు, డి.జె. దువ్వాడ జగన్నాథమ్' చిత్రాలను బన్నీ చేశాడు. అప్పట్లోనే అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్ : కనబడుట లేదు' (Icon) అనే సినిమా నిర్మించబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు. దానిని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తారనీ అన్నారు. కానీ ఎందుకో అది మాత్రం పట్టాలెక్కలేదు. ఇటీవల విడుదలైన 'పుష్ప-2' (Pushpa-2) తో బన్నీ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1871 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అల్లు అర్జున్ తదుపరి చిత్రాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే... తాజాగా అల్లు అర్జున్... దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. ఇది 'ఐకాన్' మూవీనేనా... లేకపోతే వేరే కథను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఇప్పుడున్న కమిట్ మెంట్స్ మధ్యలో దిల్ రాజుకు బన్నీ డేట్స్ ఇవ్వడమే పెద్ద విషయం అనీ అంటున్నారు. ఈ యేడాది దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల కాగా, మొదటి సినిమా నిర్మాతగా దిల్ రాజుకు చుక్కులు చూపించింది. రెండో సినిమా ఘన విజయం సాధించి, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు కొత్త ఊపిరిలూదింది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్... దిల్ రాజుకు డేట్స్ ఇవ్వడమంటే గ్రేట్ అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి.


ఇదిలా ఉంటే... 'పుష్ప-2' రేంజ్ మామూలుగా లేదనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. అమెరికన్ పాపులర్ షో 'ఎన్.బి.ఎ.' గేమ్ లో ఛీర్ లీడర్స్ ఏకంగా 'పుష్ప -2'లోని వస్తున్నాయ్ పీలింగ్స్ పాటకు స్టె్ప్పులేసి అలరించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇండియన్ సినిమా ఒకటి గ్లోబల్ స్టేజ్ లో ఏ పొజిషన్ కు చేరుకుందో చెప్పడనికి ఇదో గొప్ప ఉదాహరణ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేసినా... అది సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు.

Read Also: Kiara Adwani: మా జీవితానికి అద్భుతమైన బహుమతి 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 03:49 PM