Thandel Piracy: పైరసీదారులను పట్టుకోవడం ఈజీ.. జాగ్రత్తగా ఉండండి

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:17 PM

తాజాగా ‘తండేల్‌’ సినిమా పైరసీపై సినిమా నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పైరసీదారులకు క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. పైరసీదారులును గుర్తించడంలో ఎంత అడ్వాన్స్‌గా ఉన్నారో తెలిపారు.

Allu Aravind About Piracy

నాగచైతన్య(Naga chaitanya), సాయిపల్లవి (Sai pallavi) ప్రధాన పాత్రధారులుగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. దీన్ని పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో అది సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ఇటీవల ఓ లోకల్‌ ఛానల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే ఓ ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) బస్సులోను ఈ సినిమాని ప్రదర్శించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు.


మొదటగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ ఛాంబర్ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ జరగడం లేదు. రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి విరుచుకుపడుతోంది. దిల్ రాజు గారి సినిమాను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే, మంచి నాణ్యత కలిగిన ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోంది. వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించాం. వారిని సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ దృష్టికి తీసుకెళ్లాం. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. ఇదొక క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా సులభం. కొంతమంది వెబ్‌సైట్స్‌లోనూ పెడుతున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ‘తండేల్’ పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది’’ అన్నారు.


నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్ల నుంచి పైరసీ నియంత్రణలోకి వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకూ తగ్గింది. సినిమా మా అందరి కష్టం. మా బాధేంటంటే అంతా తెలిసే కొంత మంది ఇలాంటి పనులు చేస్తున్నారు. యువత సినిమా పైరసీ ఉచ్చులో చిక్కుకోవద్దు. ‘తండేల్’ పైరసీ చేసిన వ్యక్తులపై కేసు పెట్టాం. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. కేబుల్ ఆపరేటర్‌లకు కూడా మా హెచ్చరిక మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. ‘తండేల్’పైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి’’ అని కోరారు.

Updated Date - Feb 10 , 2025 | 05:21 PM