Allu Aravind: రామ్ చరణ్ ‘చిరుత’పై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్

ABN , Publish Date - Feb 06 , 2025 | 07:21 PM

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందా? అంటే, గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు నిజమే అని అనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ మధ్య కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ‘చిరుత’ను ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. ఇంతకీ అల్లు అరవింద్ ఏమన్నారంటే..

Allu Aravind and Ram Charan

అసలు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అభిమానులు కూడా మెగా, అల్లు అంటూ విడిపోయి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తే పరవాలేదు కానీ.. ఒకరి సినిమాలను మరొకరు కించ పరుస్తూ.. ఆఖరికి విడుదల రోజే హెచ్‌డి ప్రింట్‌ని సోషల్ మీడియాలో వదిలి.. సినిమాలను కిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త పెద్దరికం ప్రదర్శించాల్సిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా.. మీడియా ముందు లేనిపోని కాంట్రవర్సీలకు ఊతం ఇస్తూ.. మెగా, అల్లు అభిమానుల మధ్య మరింతగా ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..


రామ్ చరణ్‌ పేరు లేకుండా ‘తండేల్’ ప్రమోషన్స్ చేయలేరా?

అవును.. అల్లు అరవింద్ తీరు చూస్తున్న వారంతా అనుకుంటున్న మాట ఇదే. పేరుకు ‘తండేల్’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్సే అయినా.. ఆ ఈవెంట్స్‌లో ఎక్కువగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు.. లేదంటే, ఆయన నటించిన సినిమాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండటం చూసిన వారెవరైనా సరే.. ఇదే మాట అనుకుంటున్నారు. రీసెంట్‌గా జరిగిన ‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజుని పక్కన పెట్టుకుని ‘గేమ్ చేంజర్’ స్థాయిని తగ్గిస్తూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ‘చిరుత’ సినిమాపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగాభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ జస్ట్ యావరేజ్ ఫిల్మ్‌గా నిలిస్తే.. ఆ తర్వాత ‘మగధీర’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాను అంటూ అల్లు అరవింద్ ఈ ఇంటర్వ్యూలో చెప్పడం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

Also Read- RC16: రామ్ చరణ్ ‘ఆర్‌సి16’ సెట్స్‌లో స్పెషల్ గెస్ట్.. ఎవరో తెలుసా?


‘చిరుత’ జస్ట్ యావరేజ్ ఫిల్మా? అదెలా?

రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘చిరుత’. ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకుడు. 2007లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 25.23 కోట్ల షేర్‌ని రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు.. స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు పరిచయమైన చిత్రాలు కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చితే.. రామ్ చరణ్ తన పరిచయ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశారు. 2007లో సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 8వ హయ్యస్ట్ గ్రాసర్ చిత్రంగా అప్పట్లో ‘చిరుత’ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు, విడుదలైన చాలా సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసిన ‘చిరుత’.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్టార్ హీరోకి అత్యుత్తమ తొలి చిత్రంగా, అత్యంత విజయవంతమైన తొలి చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ‘మగధీర’ రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టరే కానీ.. ‘చిరుత’ యావరేజ్ సినిమా అయితే కాదు. రూ. 9 కోట్ల పెట్టుబడితో రూ. 25 కోట్లు సాధించిన సినిమాను జస్ట్ యావరేజ్ సినిమా అని, ఒక నిర్మాత ఎలా అంటారో.. అల్లు అరవింద్‌గారికే తెలియాలి.


అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇలా మాట మారిస్తే ఎలా?

తాజా ఇంటర్వ్యూలో ‘చిరుత’ జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పిన అరవింద్.. ‘మగధీర’ సినిమా మేకింగ్ విషయంపై కూడా మాట మార్చారు. ‘‘నా మేనల్లుడు రామ్ చరణ్ కోసం ‘మగధీర’ సినిమాను భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్‌తో సినిమా తీయాలని అనుకున్నప్పుడు రాజమౌళిగారితో డిస్కషన్ జరిగింది. రాజమౌళిగారు.. నాకు చిరంజీవిగారు ఒక 20 సంవత్సరాలుగా గీతా ఆర్ట్స్‌లో అనేక హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో చరణ్ మొదటి సినిమా చేయబోతున్నాడు. నాకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవిగారికి కానుకగా ఏం ఇవ్వగలను. చరణ్‌తో సినిమా.. ఏదో ఒకటి చేయాలి. ఎంత బడ్జెట్ అయినా పర్లేదు.. లాభనష్టాలకు అతీతంగా ఒక గొప్ప సినిమా తీసి, చిరంజీవిగారికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నా. అటువంటి సబ్జెక్ట్ ఏదైనా చూడండి అని చెప్పగానే రాజమౌళిగారు ఎంతో ఆనందించారు..’’ అని చెప్పిన అల్లు అరవింద్.. తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం మరోరకంగా చెప్పుకొచ్చారు. ‘‘నా మేనల్లుడు రామ్ చరణ్ మొదటి సినిమా వెరీ యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆ తర్వాత సినిమాకు నేను నిర్మాతని. ఆ సినిమాతో రామ్ చరణ్‌కి బిగ్ హిట్ ఇచ్చాను. మంచి దర్శకుడిని సెలక్ట్ చేసి అంత ఖర్చు పెట్టడానికి అదే ప్రధాన ఉద్దేశ్యం. అది నా మేనల్లుడిపై నాకున్న ప్రేమ’’ అంటూ అరవింద్ చెప్పడంతో.. పాత వీడియోలను తెచ్చి మరీ అల్లు అరవింద్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read- Kollywood Directors: కోలీవుడ్‌ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్‌ హీరోలు!


అసలిదంతా ఎందుకు?

అసలే ఈ మధ్య మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వార్ వాతావరణం నడుస్తుందనేలా వార్తలు మీద వార్తలు పుట్టుకొస్తుంటే.. ఆ వార్తలకు బ్రేక్ వేయాల్సిందిపోయి.. అల్లు అరవింద్ కూడా అదే రూట్‌లో వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా మాట్లాడటం మేనల్లుడిపై ప్రేమ ఎలా అవుతుందో ఆయనకే తెలియాలి అంటూ మెగాభిమానులు కొందరు డైరెక్ట్‌గానే కామెంట్స్ వదులుతున్నారు. అసలిదంతా ఎందుకు? కేవలం రామ్ చరణ్‌ని మాత్రమే ఎందుకు అల్లు ఫ్యామిలీ టార్గెట్ చేస్తుంది? అసలు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఈ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం దొరికి, ఆ రెండు ఫ్యామిలీల మధ్య దూరం ఉంటే తొలగిపోవాలని.. ఈ రెండు ఫ్యామిలీలను అభిమానించే డై హార్డ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 07:26 PM