Aditya 369: ఎన్ని హిట్స్ ఉన్నా.. ఇది ఎంతో ప్రత్యేకం

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:52 PM

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'ఆదిత్య 369' రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. 

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ (NBK) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆదిత్య 369' (Aditya 369). ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా,  గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నారు. (Aditya 369 Re Release)



'ఆదిత్య 369' రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ చిత్రాన్ని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారు.‌ 34 ఏళ్ళ క్రితం జూలై 18,‌ 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్‌ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. 'ఆదిత్య 369' చిత్రాన్ని నేను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ఇంత గొప్ప ప్రాజెక్టు నాకు ఇచ్చి నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన నందమూరి బాలకృష్ణ గారికి, సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) గారికి ఇలా రీ రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. అప్పట్లో నేను కొత్త నిర్మాత అయినా సరే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలయ్య బాబు గారికి సదా కృతజ్ఞుడిని. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా... రెండు పాత్రల్లోనూ ఆయన అద్భుతమైన నటన కనబరిచారు.

Untitled-1369.jpg

సినిమాలో అందంగా, రాజసం ఉట్టిపడుతుంది. కథకుడిగా, దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిత్రమిది. ఇటువంటి కథా ఆలోచన ఆయనకు రావడమే కాదు, తెలుగు తెరపై అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఈ సినిమాని తీర్చిదిద్దారు. అప్పట్లో ఈ సినిమా విడుదల సమయంలో నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఇప్పుడు రీ రిలీజ్ సమయంలోనూ అంతే ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇళయరాజా గారి సంగీతం, జంధ్యాల గారి మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పీసీ శ్రీరామ్ ‌- వీఎస్ఆర్ స్వామి - కబీర్ లాల్‌ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. బాలీవుడ్ టాప్ విలన్ అమ్రిష్ పురి, ఫేమస్ నటుడు టినూ ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ 'ఆదిత్య 369' చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా సరే, వెండితెరపై చూస్తే వచ్చే అనుభూతి వేరు... మ్యాజిక్ వేరు. దీనికి తోడు ఇప్పుడు డిజిటల్‌గా చేసిన సాంకేతిక హంగులు మా ‘ఆదిత్య 369’ సినిమాని మరింత అద్భుతంగా మార్చాయి. మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నిర్మాతగా 15 సినిమాలు చేశాను. ఎన్ని హిట్ సినిమాలు తీసినా సరే... నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ‘ఆదిత్య 369’. మా సంస్థ శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ఇది" అని అన్నారు. 

Updated Date - Mar 18 , 2025 | 04:04 PM