Mahesh Babu: ‘సంక్రాంతికి వస్తున్నాం’పై మహేష్ బాబు రివ్యూ
ABN , Publish Date - Jan 15 , 2025 | 05:58 PM
పెద్దోడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను చిన్నోడు మహేష్ బాబు చూశారు. సినిమాను చూడటమే కాదు.. ఆ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ ఎక్స్ వేదికగా రివ్యూ కూడా ఇచ్చారు. వెంకటేష్, మహేష్ బాబుల మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఎప్పటిలానే తనకు నచ్చిన సినిమాను ప్రమోట్ చేయడంలో ముందుండే మహేష్.. ఇప్పుడు వెంకీమామ సినిమా నచ్చిందంటూ పోస్ట్ చేశారు.
పెద్దోడు సినిమాపై చిన్నోడి రివ్యూ వచ్చేసింది. అర్థం కాలేదా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరిని కలిపి ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే.. అంతా పెద్దోడు, చిన్నోడు అనే సంభోదిస్తున్నారు. అందుకే అంది పెద్దోడి సినిమాపై చిన్నోడు రివ్యూ ఇచ్చాడని. విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా పెద్దోడి సినిమా ఎలా ఉందో చెబుతూ.. అందులో నటించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
‘‘పండగకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశాను. ఇది పర్ఫెక్ట్ పండగ సినిమా. విక్టరీ వెంకటేష్ గారు చాలా అద్భుతంగా నటించారు. వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూసి గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వారి పాత్రలలో అద్భుతంగా చేశారు. బుల్లిరాజు అనే పిల్లాడు ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు’’ అని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై మహేష్ బాబు స్పందించారు. చిన్నోడి స్పందనపై పెద్దోడి అభిమానులు స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్దోడి, చిన్నోడి బాండింగ్ అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సంక్రాంతి బరిలో చివరిగా దిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా కలెక్షన్లను రాబడుతోంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు పాజిటివ్ స్పందన రావడంతో.. సంక్రాంతి వైబ్ మొత్తం ఈ సినిమానే ఆక్రమించేసింది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. సినిమా విడుదలకు ముందే పాటలు సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాయి. దీంతో విజయం సునాయాసమైంది. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.