90S A Middle Class Biopic: '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్'కి సీక్వెల్ రెడీ.. హీరో ఎవరంటే
ABN , Publish Date - Jan 15 , 2025 | 08:56 AM
90S A Middle Class Biopic: రోషన్ రాయ్.. పెద్దయితే.. ఏమయ్యాడు? ఏమైనా మారాడా లేదా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కానీ.. ఇది సిరీస్ కాదు సినిమా. దీనిని ఎలా తెరకెక్కించనున్నారు? ఎవరెవరు నటిస్తున్నారు అంటే..
గతేడాది ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్'. మధ్య తరగతి అనుబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ.. ఇది సిరీస్ కాదు సినిమా. దీనిని ఎలా తెరకెక్కించనున్నారు? ఎవరెవరు నటిస్తున్నారు అంటే..
యంగ్ డైరెక్టర్స్ ఆదిత్య హాసన్, నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు సీక్వెల్ సిద్ధమైంది. దర్శకుడు నవీన్ మేడారం నిర్మాత అవతారం ఎత్తనున్నాడు. ఈ సిరీస్ లో పేరెంట్స్ గా నటించిన శివాజీ, ఆయన భార్య క్యారెక్టర్ సినిమాలో కంటిన్యూ కానున్నారు. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే అందరి ఫేవరేట్ చిన్న కొడుకు పాత్రలో నటించిన రోషన్ రాయ్.. పెద్దయితే… ఏమయ్యాడు? ఏమైనా మారాడా లేదా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను లండన్ లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే అనౌన్స్ మెంట్ గ్లిమ్ప్స్ రెడీ అయ్యింది. త్వరలోనే ఈ వీడియోని రిలీజ్ చేయనున్నారు.
కాగా, చిన్నోడి పాత్ర పెద్ద అయ్యాక.. ఆ రోల్ లో 'ఆనంద్ దేవరకొండ' నటించనున్నాడు. 'బేబీ' సినిమాతో సంచలన విజయం పొందిన తర్వాత ఆనంద్ 'గం గం గణేశా' చిత్రంతో నిరాశపరిచాడు. అంతకు ముందు ఆనంద్ నటించిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే మిడిల్ క్లాస్ బాయ్ గా ఆనంద్ కరెక్ట్ ఛాయిస్ అనిపిస్తుంది.