Telugu Cinema: అప్పట్లో 200కు పైగా సెంటర్స్... ఇప్పుడంత సీన్ లేదు....
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:06 PM
సంక్రాంతికి వస్తున్నాం సినిమా 92 కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శితమైంది. నిజానికి గతంలో 200 కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శితమైన చిత్రాలు ఉన్నాయి. కానీ ఓటీటీల కారణంగా ఇప్పుడు థియేట్రికల్ రన్ తగ్గిపోయింది.
ఇవాళ ఫస్ట్ డే కలెక్షన్స్, వీకెండ్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మధ్యే పోటీ ఉంటోంది. 50 డేస్, 100 డేస్ అనే మాటే వినిపించడం లేదు. ఇలాంటి సమయంలో కూడా సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankrathi ki Vasthunnam) మూవీ ఏకంగా 92 సెంటర్స్ లో యాభై రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ తెలిపారు. విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్ లో విడుదలైన పలు చిత్రాలు అతనికి మంచి విజయాన్ని అందించిపెట్టాయి. ముఖ్యంగా 'చంటి, ధర్మచక్రం, కలిసుందాం రా, లక్ష్మీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2' వంటివి మంచి విజయాన్ని అందించాయి. సంక్రాంతికే వచ్చిన 'ప్రేమ', 'ధర్మచక్రం', 'కలిసుందాం రా' చిత్రాలు ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టాయి. గత యేడాది సంక్రాంతికే వచ్చిన వెంకటేశ్ 75వ చిత్రం 'సైంధవ్' నిరాశ పర్చినా ఈ యేడాది ఆ లోటును 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ తీర్చేసింది. దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా విశేషంగా తెలుగువారిని ఆకట్టుకుంది. మార్చి 1 నుండి ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా... విడుదలై యాభై రోజులు పూర్తయ్యే సరికీ మూవీ 92 సెంటర్స్ లో ప్రదర్శితమౌతోంది. ఈ మధ్య కాలంలో ఇన్ని కేంద్రాలలో యాభై రోజుల పాటు ఆడిన సినిమా ఇదే అంటున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే... గత యేడాది సంక్రాంతికే వచ్చిన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' (Hanuman) 150 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైందని మేకర్స్ పేర్కొన్నారు. లాస్ట్ ఇయర్ చిత్రాలలో 'కల్కి' (Kalki) మంచి విజయాన్ని అందుకుంది. ఇది పాన్ ఇండియా మూవీ కూడా కావడంతో దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శితమైంది. ఇక ఎన్టీఆర్ 'దేవర' చిత్రం 52 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైందని మేకర్స్ థియేటర్స్ లిస్ట్ తో సహా ప్రకటించారు. అలానే గత యేడాది సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' (Gunturu Kaaram), దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్' వంటి సినిమాలూ యాభై రోజుల పాటు ప్రదర్శితమయ్యాయి.
నిజానికి తెలుగు చిత్రాలు యాభై రోజులు ప్రదర్శితం కావడం కొత్తేమీ కాదు. గతంలో పలు చిత్రాలు విశేషంగా అర్థ శతదినోత్సవం, శతదినోత్సవం జరుపుకున్నాయి. ఉదాహరణకు 'మగధీర, సింహాద్రి, పోకిరి, లక్ష్మీ నరసింహా' వంటి సినిమాలు అప్పట్లో రెండు వందలకు పైగా కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైన సందర్భాలు ఉన్నాయి. అయితే... కరోనా తర్వాత ఓటీటీల ప్రభావం పెరిగిపోవడంతో పెద్ద సినిమాలను సైతం మూడు, నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుండటంతో థియేట్రికల్ రన్ బాగా తగ్గిపోయింది. అయినా... 'సంక్రాంతికి వస్తున్నాం' 92 కేంద్రాలలో ఇంకా ప్రదర్శిస్తుండటం, రూ. 300 కోట్లకు పైగా ఇది గ్రాస్ ను వసూలు చేయడం విశేషమే.
Also Read: GV And Divya: జీవీ ప్రకాశ్, దివ్యభారతి సమ్ థింగ్ సమ్ థింగ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి