Bhagyashri borse: డల్‌గా అనిపిస్తే అలా చేసి రీబూస్ట్ చేసుకుంటా
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:54 AM
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్‌లో ఒక అభిమాని సడెన్‌గా నన్ను డ్యాన్స్ చేయమని కోరాడు. మొదట సంశయించా కానీ, డైరెక్టర్ హరీష్‌శంకర్ కూడా చెయ్యమని సైగ చేయడంతో ‘రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే..’ పాటకి స్టెప్పులేశా.
‘మిస్టర్ బచ్చన్’తో(Mr Bachan) తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన భాగ్యశ్రీ బోర్సే పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. వరుసగా విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్, సూర్య వంటి స్టార్ల సరసన అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ మరాఠీ భామ చెబుతున్న కొన్ని తాజా కబుర్లివి... (Bhagyashri Borse)
డ్యాన్స్‌తో వైరలయ్యా...
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్‌లో ఒక అభిమాని సడెన్‌గా నన్ను డ్యాన్స్ చేయమని కోరాడు. మొదట సంశయించా కానీ, డైరెక్టర్ హరీష్‌శంకర్ కూడా చెయ్యమని సైగ చేయడంతో ‘రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే..’ పాటకి స్టెప్పులేశా. కట్‌చేస్తే... నా డ్యాన్స్ వీడియో తెగ వైరలయ్యింది. సోషల్‌మీడియాలో చాలామంది ‘నేషనల్ క్రష్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అవి నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్‌గా అనిపించాయి.
కల నెరవేరింది (Actress Bhagyashri Borse)
నా స్వస్థలం ఔరంగాబాద్. నాన్న ఉద్యోగరీత్యా లాగోస్ (నైజీరియా) షిఫ్ట్ అయ్యాం. స్కూలింగ్ అక్కడే పూర్తిచేశా. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివేందుకు ముంబయికి వచ్చేశా. చదువుకుంటూనే మోడలింగ్ చేసేదాన్ని. పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించా. నా స్ర్కీన్ ప్రెజెన్స్ బాగుందని, సినిమాల్లో ప్రయత్నించమని కొందరు సలహా ఇచ్చారు. మొదట్లో ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా. చివరికి ‘యారియన్ 2’లో చిన్న పాత్ర దక్కింది. ‘చందు ఛాంపియన్’లో కూడా అతిథి పాత్ర చేశా. చివరికి ‘మిస్టర్ బచ్చన్’ రూపంలో హీరోయిన్ కావాలనే నా కల నెరవేరింది.
పాత సినిమాలకే ఓటు
నేను షారుక్‌ఖాన్‌కి వీరాభిమానిని. ఆయన సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూశా. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమాలంటే... రాజేష్ ఖన్నా ‘ఆనంద్’, అమితాబ్ ‘షోలే’ చిత్రాలు. హాలీవుడ్ సినిమా ‘డెడ్ పోయెట్స్ సొసైటీ’ ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. నిజానికి నేను ఎక్కువగా పాత సినిమాలు చూడడానికే ఇష్టపడతాను.
ఎగతాళి చేసేవారు...
పర్‌ఫెక్ట్ డ్యాన్సర్‌ను కాను. కానీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటా. మా అమ్మ డ్యాన్స్ టీచర్. చాలామందికి శిక్షణ ఇచ్చారు. చిన్నతనంలో బొద్దుగా ఉండేదాన్ని. ఆ కారణంగా డ్యాన్స్ చేయలేకపోయేదాన్ని. నా డ్యాన్స్ చూసి చాలామంది ఎగతాళి చేసేవారు. పెద్దయ్యాక ఎలాగైనా మంచి డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకున్నా. నాకు ఎప్పుడైనా డల్‌గా అనిపిస్తే డ్యాన్స్, మ్యూజిక్‌తోనే ఉపశమనం పొందుతా. ఆ విధంగా నన్ను నేను రీ బూస్ట్ చేసుకుంటా.
అమ్మ కళ్లలో ఆనందభాష్పాలు
‘చందు ఛాంపియన్’ ప్రీమియర్ షోకి అమ్మానాన్నలని వెంటబెట్టుకొని వెళ్లా. నేను స్ర్కీన్ మీద కనిపించినంతసేపు మా అమ్మ కళ్లలో ఆనందభాష్పాలు చూశా. ఆ క్షణం నాకు చాలా గర్వంగా అనిపించింది. అది నాకు మరపురాని మధుర జ్ఞాపకం. ఇక చేదు జ్ఞాపకమంటే... నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా.. క్యాంటీన్ ముందు బురదలో జారిపడ్డా. నన్ను చూసి అందరూ పగలబడి నవ్వారు. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంది.
దేవుడి సన్నిధిలో...
నాకు దైవభక్తి చాలా ఎక్కువ. రోజూ ఉదయం గణేశ్ మంత్రం చదువుతా. ఖాళీ దొరికితే అమ్మని వెంటబెట్టుకొని గుళ్లు, గోపురాలు తిరుగుతుంటా. మూడ్ బాగోకపోతే దేవుడి సన్నిధిలో కాస్త సమయం గడపగానే మనసు తేలికపడుతుంది. నన్ను నేను గాడ్స్ డాటర్‌గా చెప్పుకుంటా. ఆ భగవంతుడి కృపాకటాక్షాల వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని బలంగా నమ్ముతా.
ప్రకృతి ప్రేమికురాలిని
చిన్నప్పుడు స్కూల్‌లో కన్నా ప్లే గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, జావెలిన్ త్రో, లాంగ్‌జంప్, రన్నింగ్... ఇలా అన్ని ఆటల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. షూటింగ్‌లో విరామం దొరికితే అడవులు, కొండ ప్రాంతాలకు విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటా. నేను ప్రకృతి ప్రేమికురాలిని. నచ్చిన సంగీతం వింటూ, ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరితే... ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేను.