Kamal Haasan: కమల్ 'హే రామ్' ఎందుకు ప్లాఫ్ అయింది
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:21 PM
ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు అంటారు. ఎంత ఉదాత్తంగా మాట్లాడినా, కొందరు తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఇతరులను చిన్నచూపు చూస్తారు. పాతికేళ్ళ క్రితం నట నిర్మాత దర్శకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అలాగే ప్రవర్తించారు.
ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు అంటారు. ఎంత ఉదాత్తంగా మాట్లాడినా, కొందరు తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఇతరులను చిన్నచూపు చూస్తారు. పాతికేళ్ళ క్రితం నట నిర్మాత దర్శకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అలాగే ప్రవర్తించారు. తాను నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన 'హే రామ్' (Hey Ram) సినిమాను ఆత్మ ఉన్న కథగా అభివర్ణించారు. అలాగే సర్ రిచర్డ్ అటెన్ బరో (Richard Attenborough) రూపొందించిన 'గాంధి' (Gandhi) (1982) చిత్రాన్ని ఓ పరదేశీయుడు తీసిన 'ట్రావెల్ మూవీ'గానే పరిగణించాలనీ కమల్ అన్నారు. అందులో కంటే తన 'హే రామ్'లోనే ఆత్మ ఉందని కమల్ గొప్పగా చెప్పుకున్నారు.
తానొకటి తలిస్తే, వేరొకటి జరిగిందన్నట్టుగా 2000 ఫిబ్రవరి 18న విడుదలైన 'హే రామ్' బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలయింది. ఈ సినిమా దెబ్బతిన్నా, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపింది. కానీ, ఆ సినిమాకు ఆస్కార్ నామినేషన్ లభించలేదు. కమల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా రిచర్డ్ అటెన్ బరో మూవీని తక్కువ చేసి మాట్లాడినా, తరువాతి రోజుల్లో 'గాంధి' మేకింగ్ వేల్యూస్ కు జైకొట్టారు. అంతేకాదు, 'హే రామ్' సినిమాలోనే 'గాంధి'లో టైటిల్ రోల్ పోషించిన బెన్ కింగ్ స్లే (Ben Kingsley) ను మళ్ళీ గాంధీజీగా నటింప చేయాలనీ ఆశించారు కమల్. మరి 'గాంధి'లో బెన్ ఎంత గొప్పగా నటించకపోతే, ఆ పాత్రకు మళ్ళీ ఆయననే ఎంచుకోవాలని కమల్ తపిస్తారు చెప్పండి. అంతలా బెన్ కింగ్ స్లే నుండి నటన రాబట్టుకున్న అటెన్ బరోను తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదని విమర్శలు వినిపించాయి. బెన్ మళ్ళీ 'గాంధి'లో లాగా గాంధీజీ పాత్రలో నటించలేనని వీలు కాదన్నారు. దాంతో అప్పటికే ఓ నాటకంలో గాంధిగా నటించిన నజీరుద్దీన్ షా (Naseeruddin Shah)ను సంప్రదించారు కమల్. ఆయన కూడా ఆ మేకప్ కోసం చాలా సమయం కేటాయించవలసి ఉంటుందని 'నో' అన్నారు. అయితే కమల్ అభ్యర్థన మేరకు చివరకు నజీరుద్దీన్ అంగీకరించారు. ఏమైతేనేమి, 'గాంధి'కి ఘనవిజయం సాధించి పెట్టిన జనం 'హే రామ్'కు జైకొట్టలేకపోయారు.