Vishal Comments: సినిమాలు తీసే సత్తా ఉన్నా వాళ్లెందుకు తీయట్లేదు..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:20 PM
చిత్ర పరిశ్రమలో పరిస్థితిని ఉద్దేశించి హీరో విశాల్ (Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ అని ఆయన అన్నారు
చిత్ర పరిశ్రమలో పరిస్థితిని ఉద్దేశించి హీరో విశాల్ (Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పినట్లు గుర్తు చేశారు. 'మదగజ రాజా' (Madha gaja raja) సినిమా సక్సెస్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ
‘‘సినీ పరిశ్రమలో ఉండే పరిస్థితుల గురించి గతంలోనూ నేను మాట్లాడాను. అప్పుడు అందరూ నన్ను విలన్‌లా చూశారు. ఒక సినిమా తెరకెక్కించాలంటే కనీసం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద పిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. లేదంటే, భూమి కొనుగోలు చేయండి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. ఇలాంటి నిజాలను ఎవరూ బయటకు వచ్చి చెప్పరు. డబ్బు ఉన్న వాళ్లు ఎవరైనా సినిమాలు చేయొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వాళ్ల వద్ద అంతగా డబ్బు ఉంది. కోట్టు నష్టం వచ్చిన తట్టుకోగలరు. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’’ అని విశాల్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి(Vishal Comments on Kollywood).
2024 కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాల పాలైందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు(Tamil Film Industry) . గత ఏడాదిలో ఆ పరిశ్రమలో సుమారు రూ.1000 కోట్లు నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది తమిళ నిర్మాతలు దాదాపు రూ.3వేల కోట్లతో 241 చిత్రాలను నిర్మించి, విడుదల చేశారు. వాటిలో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయని వారు పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా దర్శక, నిర్మాతలు ఎంతో మారాలని, కథల ఎంపిక, వాటిని తీర్చిదిద్దే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.