Chiyaan Vikram: చియాన్ చిత్రానికి కొత్త చిక్కులు...

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:27 PM

శాటిలైట్, ఓటీటీ హక్కుల ఒప్పందాన్ని అతిక్రమించారంటూ బి 4 యు సంస్థ 'వీర ధీర శూరన్ -2' నిర్మాతలపై కోర్టు కెక్కింది. దాంతో ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది.

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 'వీరధీర శూరన్ -2' (Veera Dheera Sooran -2) మూవీ మరోసారి చిక్కుల్లో పడింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 27న విడుదల అవుతుందని అంతా భావించారు. హీరో విక్రమ్, హీరోయిన్ దుషారా విజయన్ (Dushara Vijayan) కూడా అగ్రెసివ్ గా పబ్లిసిటీలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఇక్కడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో ఈసారి ఖచ్చితంగా సినిమా జనం ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు.


VDS _ First Single Poster 1 (1).jpg

నిజానికి కొంతకాలంగా విక్రమ్ సినిమాల విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి విడుదల కావడం లేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా విక్రమ్ సినిమాల విడుదల పరిస్థితి ఏర్పడింది. అతని సినిమా రిలీజ్ అయితే అయ్యిందని అనుకోవాల్సి వస్తోంది. విక్రమ్, గౌతమ్ వాసుదేవ మీనన్ (Gowtham Vasudeva Menon) కాంబినేషన్ లో తెరకెక్కిన 'ధృవ నక్షత్రం' (Dhruva Nakshatram) మూవీ కూడా పలు మార్లు చివరి నిమిషంలో విడుదల కాకుండా ఆగిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా వెలుగు చూడలేదు. దానికి కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అయితే ఈ సారి 'వీర ధీర శూరన్-2' విడుదలకు మోకాలు అడ్డింది ఉత్తరాది సినిమా నిర్మాణ సంస్థ. అక్కడి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ బి4యు తో 'వీర ధీర శూరన్ -2' నిర్మాత చేసుకున్న ఒప్పందాన్ని పాటించలేదట. దాంతో ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు బయట బి 4 యు అధినేతలతో మంతనాలు జరిపినా అవి ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కనీసం గురువారం మార్నింగ్ షో, మాట్నీ పడక పోయినా.. ఫస్ట్ షో నుండి 'వీర ధీర శూరన్ -2' షోస్ పడతాయని విక్రమ్ అభిమానులు భావించారు. కానీ ఢిల్లీ హైకోర్టు... ఇప్పుడు నాలుగు వారాల పాటు ఈ సినిమా ప్రదర్శనను నిలిపి వేసిందని తెలుస్తోంది.


తమ సంస్థకు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇస్తానని చెప్పి, ఆ తర్వాత మాట తప్పి మరో సంస్థకు వాటిని అమ్మేశారన్నది బి 4 యు ప్రొడక్షన్ హౌస్ చేస్తున్న మెయిన్ ఎలిగేషన్. అందుకు గానూ కోర్టు ఏడు కోట్ల రూపాయలను డిపాజిట్ చేయడంతో పాటు సంబంధిత పత్రాలను 48 గంటల లోపు సబ్ మిట్ చేయమని చెప్పిందట. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు, బి 4 యు సంస్థ మధ్య రాజీ ఏర్పడితే... ఓకే... 'వీర ధీర శూరన్ -2' త్వరలో విడుదలవుతుంది. లేదంటే... నిర్మాతలు ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తెల్చుకుని, కొత్త తేదీని నాలుగు వారాల తర్వాత ప్రకటించాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ లోని ''ఎంపురాన్, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్'' తో పాటు హిందీ చిత్రం 'సికందర్'కు విక్రమ్ సినిమా నుండి కొద్ది పాటి పోటీ ఎదురవుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. ఇప్పుడీ కొత్త చిక్కుల కారణంగా ఆ పోటీ తప్పిపోయింది.

Also Read: Chiranjeevi: రామ్‌చరణ్‌ పెద్ది లుక్‌పై చిరంజీవి కామెంట్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 27 , 2025 | 03:27 PM