Vishal: ఆయన దర్శకత్వంలో నటించడం మంచి మందుతో సమానం
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:23 PM
‘మద గజ రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో నేను 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నా. ఒక హీరోగా ఆ వేడుకలో పాల్గొనాల్సిన బాధ్యత నాది. కానీ, సోషల్ మీడియాలో ఎన్నో కథలు అల్లేశారు. నిజాలు తెలుసుకుని వాస్తవాలను రాయాలని కోరుతున్నా అన్నారు విశాల్. ‘మద గజ రాజా’ విజయం సాధించిన సందర్బంగా యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడారు.
సుందర్ సి దర్శకత్వంలో నటించడం మంచి మెడిసన్‌తో సమానమని హీరో విశాల్ అన్నారు. తాను వైద్యుడి వద్దకు వెళ్లేందుకు సంకోచిస్తానని, కానీ, సుందర్ దర్శకత్వంలో నటించడమంటే మానసికంగా, ఆరోగ్యపరంగా తనలో తనకు తెలియకుండానే ఎక్కడ లేని హుషారు వస్తుందన్నారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మద గజ రాజా’ (ఎంజీఆర్). చిత్రీకరణ పూర్తి చేసుకుని 12 యేళ్ల తర్వాత పొంగల్ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని పురస్కరించుకుని చెన్నై నగరంలో థ్యాంక్స్ గివింగ్ మీట్‌ను నిర్వహించగా.. ఇందులో హీరో విశాల్, హీరోయిన్ అంజలి, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని, దర్శకుడు సుందర్ సి తదితరులు పాల్గొన్నారు.
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ... ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సమయంలో నేను 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నా. ఒక హీరోగా ఆ వేడుకలో పాల్గొనాల్సిన బాధ్యత నాది. కానీ, సోషల్ మీడియాలో ఎన్నో కథలు అల్లేశారు. నిజాలు తెలుసుకుని వాస్తవాలను రాయాలని కోరుతున్నా. ఒక దర్శకుడు 30 యేళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగడం అంటే సాధారణ విషయం కాదు. చిత్ర నిర్మాత మనోహరన్‌తో నాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. దివంగత నటుడు ఎంజీఆర్ పైలోకం నుంచి మా బృందాన్ని ఆశీర్వదిస్తున్నారు. అందుకే ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు.
దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ... ఒక చిత్రం 12 యేళ్ల తర్వాత విడుదలవుతోంది, ఏం విజయం సాధిస్తుందంటూ పలువురు వ్యాఖ్యానించారు. కానీ, ఫలితాన్ని ఇచ్చేది ప్రేక్షక దేవుళ్లు మాత్రమే. వారు అద్భుతమైన తీర్పునిచ్చారు. ఈ సినిమా విడుదలకు సహకరించిన తిరుపూరు సుబ్రహ్మణ్యం, ఏసీ షణ్ముగం, ఏసీఎస్ అరుణ్ కుమార్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అన్నారు. కాగా, ఈ మూవీలో విశాల్, సంతానం, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.